Political War in Gadwal Congress :గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత ఈ ఇద్దరు నాయకుల మధ్య వర్గపోరు గద్వాల నియోజకవర్గంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. శనివారం రోజు ర్యాలంపాడు, గట్టు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కోసం వచ్చిన రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును సరిత వర్గీయులు అడ్డుకున్నారు. తొలత గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లిన జూపల్లి, అక్కణ్నుంచి ప్రాజెక్టుల సందర్శకు బయలు దేరారు.
వాహనంపై రాళ్లదాడి :కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ అయిన సరితకు సమాచారం లేకుండా గద్వాలలో ఎలా పర్యటిస్తారంటూ అడుగడుగునా ఆమె అనుయాయులు అడ్డుపడ్డారు. చివరకు సరిత దగ్గరకు వచ్చి మాట్లాడతానని చెప్పినా వినలేదు. జూపల్లి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఓ దశలో జూపల్లి వాహనంపైనా రాళ్లు విసిరారు. కాంగ్రెస్ కార్యకర్తల నిరసనల నడుమ జూపల్లి సరిత ఇంటికి చేరుకుని సరితా-తిరుపతయ్య దంపతులతో కాసేపు భేటీ అయ్యారు. అనంతరం వారితో కలిసి ర్యాలంపాడు జలశాయాన్ని సందర్శించారు.
వర్గపోరుపై ఎమ్మెల్యే విచారం : ర్యాలంపాడు నుంచి గట్టుకు వెళ్లే దారిలోనూ, ఇరువర్గాల మధ్య అక్కడక్కడా ఘర్షణ వాతావరణం నెలకొంది. గట్టు సందర్శన అనంతరం జూపల్లి, సరిత వెళ్లిపోయారు. కాంగ్రెస్‌లో ఈ తరహా ఘటనలు సహజమేనని, కాంగ్రెస్ నియంతృత్వ పార్టీ కాదని జూపల్లి పేర్కొన్నారు. ఎవరో కొందరు కార్యకర్తలు క్షణికావేశానికి లోనై చేసే ఈ తరహా అడ్డగింతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాగా, జూపల్లిని అడ్డుకోవడంపై ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.