Over Confidence Special Story :మన బలం గురించి మనం తెలుసుకోవడం కాన్ఫిడెన్స్. అయితే మనకు లేని బలాన్ని ఊహించుకోవడం ఓవర్‌కాన్ఫిడెన్స్. అక్కడే ఆగిపోయినవారి గురించి మాట్లాడుకోడానికి ఏమీ ఉండదు. అతికొద్దిమంది మాత్రం ఏదో ఓ దశలో తమలోని ఓవర్‌కాన్ఫిడెన్స్‌ను గుర్తిస్తారు. అంతర్మథనం, ఆత్మసమీక్షతో ఓవర్‌ను డిలీట్ చేసి కాన్ఫిడెన్స్‌ను మాత్రం సేవ్ చేసుకుంటారు. తమను తాము సరికొత్తగా ఆవిష్కరించుకుంటారు. అలా అని, ఓవర్‌కాన్ఫిడెన్స్‌ను చిన్నచూపు చూడలేం. అప్పుడప్పుడూ గెలుపు ఆకలిని పెంచే సూప్‌లానూ పనిచేస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు.
ఏది కాన్ఫిడెన్స్? ఏది ఓవర్‌కాన్ఫిడెన్స్? దీన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఎలా నిర్ణయిస్తారు? : ఓవర్‌కాన్ఫిడెన్స్ అచ్చంగా ఓ మానసిక స్థితి. ఉన్న బలాన్ని అతిగా ఊహించుకోవడం, నియంత్రణలో లేని విషయాల్ని కూడా కంటిచూపుతో అదుపు చేయగలమని గుడ్డిగా నమ్మేయడం, లేని శక్తుల్ని ఆపాదించుకోవడం ఓవర్‌కాన్ఫిడెన్స్ వ్యక్తుల ప్రాథమిక లక్షణాలు. కొందరు జన్యుపరమైన కారణాలతో, మరికొందరు పెంపకంలోని అతి గారాబం వల్లా, ఇంకొందరు అంతులేని ఆశలతో, కొందరు యాదృచ్ఛిక విజయాల ప్రభావంతో ఓవర్‌కాన్ఫిడెన్స్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోతారు. అలా అని వాళ్లను చులకనగా చూడలేం.
అయితే, తన మీద తనకున్న అతి నమ్మకం కాస్తా పక్కా కాన్ఫిడెన్స్‌గా మారిపోతుంది. కొందరు నిజంగానే ఆ అగాధాన్ని పూడ్చేసుకుని తామేమిటో నిరూపించుకుంటారు. మరికొందరు ఆ ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేసి ఆరంభశూరులుగా ముద్ర వేసుకుంటారు. ఇంకొందరు ఆ భ్రమల్లోనే బతికేస్తూ పిట్టల దొరలుగా మిగిలిపోతారు. ఆ మాటకొస్తే ప్రతి మనిషిలోనూ ఆవగింజంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాకపోతే, మన ఓవర్ కాన్ఫిడెన్స్ మనకు కాన్ఫిడెన్స్‌లా కనిపిస్తుంది. ఇతరుల కాన్ఫిడెన్స్ మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్‌లా అనిపిస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్‌ను మనసు చేసే మ్యాజిక్‌గానూ చెబుతారు సైకాలజిస్టులు. మనలో ఆశావాదాన్ని నింపడానికి ఇలాంటి చిట్కాలు ప్రయోగిస్తుందని అంటారు. కాకపోతే, ఆ తూటా చాలాసార్లు గురితప్పుతుంది.
సరికొత్తగా అవతరించాలి :మనల్నిఓవర్‌కాన్ఫిడెన్స్ మాయలో పడేస్తుంది. అదే మన నిజ స్వభావమని అనుకుంటాం. ఆ మత్తులో ఊగిపోతాం. మనమీద మనకు మితిమీరిన విశ్వాసం ఉన్నప్పుడు ఎదుటి మనిషిని ఓపట్టాన నమ్మలేం. అవతలి వ్యక్తిలోని నైపుణ్యాన్ని గుర్తించలేం. అనుభవజ్ఞుల సలహాలు ఆమోదించలేం. మార్పును స్వాగతించలేం. విమర్శించేవారినీ, ప్రశ్నించేవారినీ దగ్గరికి రానివ్వం. దీంతో చుట్టూ భజనపరులు చేరిపోతారు. ఓవర్‌కాన్ఫిడెన్స్ వ్యక్తులతో ఇంకో ప్రమాదమూ ఉంది. తమ మిడిమిడి జ్ఞానంతో, అర్థంలేని అహంకారంతో ఎదుటివారి ఆత్మవిశ్వాసాన్నీ దెబ్బతీస్తారు. ఇదోరకమైన మానసిక క్యాన్సర్. మనల్ని మనం సమీక్షించుకున్నప్పుడే రోగ లక్షణాలు బయటపడతాయి.