తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదర్శం 'అనిత' జీవితం : ఆమె నడవలేకపోయినా - వేల మందిని నడిపిస్తోంది - Inspirational Vice Chancellor Story - INSPIRATIONAL VICE CHANCELLOR STORY

Story on SKU Incharge Vice Chancellor : మూడేళ్లకే పోలియో కారణంగా ఆమె రెండు కాళ్లూ, ఒక చేయి చచ్చుపడ్డాయి. అప్పటికి ఓనమాలైనా దిద్దలేదామె. కానీ విద్యతోనే స్వతంత్రం, గౌరవమని భావించింది ఆమె తల్లి. అందుకే ఆ చిన్నారిని చదువుకు దూరం కానివ్వలేదు. అప్పుడు ఆమె అమ్మమాట విని ఇప్పుడు చదువులమ్మగా మారారు. నేడు ఓ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అనిత. మరి ఇదేలా సాధ్యమైందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

Inspirational Story on SKU Incharge Vice Chancellor
Story on SKU Incharge Vice Chancellor (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 2:11 PM IST

Inspirational Story on SKU Incharge Vice Chancellor : నా మూడేళ్లకే పోలియో సమస్య బయటపడింది. అప్పుడే చెన్నైలో కాళ్లు, చేతికి శస్త్రచికిత్స చేశారు. అయిదేళ్లకు మరోసారి, పన్నెండేళ్లు వచ్చేసరికి నాలుగుసార్లు శస్త్ర చికిత్సలు అయ్యాయి. ఆపరేషన్​ చేసుకున్నప్పుడల్లా ఆసుపత్రిలో, ఇంట్లో మూడేసి నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చేది. దీంతో స్కూల్​కు రోజూ వెళ్లే పరిస్థితి లేదు. ఇంటి దగ్గరే చదివించింది మా అమ్మ. శస్త్రచికిత్స తర్వాత కొన్నాళ్లు నడవగలిగినా తర్వాతి కాలంలో ఊత కర్ర, వాకర్‌ సాయం తీసుకోవాల్సి వచ్చింది. ఏడో తరగతి ఎగ్జామ్స్​ ప్రైవేట్​గా రాసి పాసయ్యా. ఎనిమిదో తరగతి నుంచి స్కూల్‌కు వెళ్తుండేదాన్ని. టెన్త్​ క్లాస్​లో ప్రథమ శ్రేణిలో పాసైన రోజు మా ఇంట్లో పండగ వాతావణరమే.

విద్యార్థులతో ఎస్కేయూ ఉపకులపతి అనిత (ETV Bharat)

మాది అనంతపురం జిల్లాలోని పామిడి. నాన్న బి. ఆంజనేయులు గౌడ్, అమ్మ ప్రఫుల్ల. నలుగురు పిల్లల్లో నేను వేరు అని ఫీలవకుండా వాళ్లతో సమానంగా మా అమ్మ నాకు ఇంట్లోని పనులు చెప్పేది. దివ్యాంగురాలిని, ఏ పనీ చేతకాదని ఎప్పుడు అనుకోవద్దు. ఒకరిపైన ఆధారపడకు. మేం ఎప్పటికీ నీతోపాటు ఉండలేమని అమ్మ పదేపదే చెబుతూనే నీ జీవితం నీ చదువుపైనే ఆధారపడి ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న, స్వతంత్రంగా ఉండాలన్న చదువు కొనసాగాలని అంటుండేది. ఆ మాటల వల్లే కావొచ్చు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చదువు కొనసాగించాను. అనంతపురం జిల్లాలోని పామిడి ఇంటర్, తిరుపతిలో బీకాం చేశా.

1989లో టీచింగ్‌ను ఎంచుకున్నా : పారిశ్రామిక రంగంలో మేనేజర్‌ కావాలని ఉండేది నాకు. దాని కోసం ఎంబీఏ చేయాలని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ(ఎస్కేయూ)లో ఎంబీఏ ప్రవేశానికి 1986లో పరీక్ష రాశా. దేశవ్యాప్తంగా 1000 మంది ఆ పరీక్ష రాస్తే రాస్తే 12 మంది ఎంపికయ్యారు. వారిలో ఇద్దరమే అమ్మాయిలం. ఎంబీఏ తర్వాత కోల్‌కతాకు చెందిన ఓ సంస్థలో ఉద్యోగం, ఎస్కేయూలోనే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఇలా నా ముందు రెండు అవకాశాలు వచ్చాయి. నా లక్ష్యం గురించి చెప్పినా అంత దూరం పంపడానికి అమ్మానాన్న ఒప్పుకోలేదు. దీంతో 1989లో టీచింగ్‌ను ఎంచుకున్నా. మొదట్లో ఇదో ఉద్యోగం అనుకునేదాన్ని.

కానీ విద్యార్థులతో అనుబంధం ఏర్పడ్డాక ఈ వృత్తిలోని సంతృప్తి అనుభవమైంది. ఆపై బోధన సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటూ వచ్చా. క్వాలిటీ ఆఫ్‌ వర్క్‌లైఫ్‌ ఇన్‌ కమర్షియల్‌ బ్యాంక్స్‌ అనే అంశంపైన 1995లో పీహెచ్‌డీ చేశా. 2009లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందిన. కమ్యూనికేషన్‌ స్కిల్స్, హెచ్‌ఆర్, మార్కెట్‌ మేనేజ్‌మెంట్‌ అంశాల్ని కూడా బోధిస్తా. వర్సిటీలో 'మహిళా అధ్యయన కేంద్రం’ మొదటి సంచాలకురాలిగా నేను పనిచేశా. మహిళా చైతన్యంపై అనేక సదస్సులు నిర్వహించా. వీటన్నింటి ఫలితంగానే ఇటీవల నన్ను ఎస్కేయూకి ఇన్‌ఛార్జి ఉపకులపతిగా నియమించింది.

ఆదర్శంగా ఉండాలనుకుంటున్నా : 50 ఏళ్లు దాటాక మళ్లీ ఆరోగ్య సమస్యలు వచ్చాయి. కిందపడ్డప్పుడు కాళ్ల ఎముకలు అయిదుసార్లు విరిగాయి. ఇలాంటి స్థితిలో ఉద్యోగం అవసరమా అని అన్నవాళ్లు ఉన్నారు. అయినా అధైర్యపడలేదు. అమ్మ మాటల్ని గుర్తుచేసుకుని ముందుకు వెళ్లా. మా ఆయన శివకుమార్​, వ్యాపారవేత్త. మాకో అబ్బాయి. తను ఇంజినీర్​. దివ్యాంగులు బయటకు వెళ్లగలమా, మెట్లు ఎక్కగలమా అని ఆలోచిస్తాం. మహిళగానూ ఎక్కడికీ స్వేచ్ఛగా వెళ్లలేని పరిస్థితి. ఈ సమస్యలను తలచుకుంటూ కూర్చుంటే మన గమ్యాన్ని చేరకోలేం. వాటిని గుర్తించి అధిగమించే ప్రయత్నం చేయాలి. అందుకు ప్రణాళిక, సహనంతో పాటు పట్టుదల ఉండాలి. నా జీవితం, దివ్యాంగులకు, మహిళలకు ఆదర్శంగా ఉండాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నా.

YUVA : సంకల్పం ముందు - వైకల్యం ఓడింది - ఈయన ఓ తరానికి ఇన్​స్పిరేషన్ - Disabled Man Inspiring Story

ABOUT THE AUTHOR

...view details