Minister Ponguleti on Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అక్టోబరు 15 నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇందుకు వారం రోజుల్లో విధివిధానాలను రూపొందిస్తామని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్‌తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు. పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లను అర్హులకు అందించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్టోబరు 2 నుంచి అర్హులకు రేషన్ కార్డులు, హెల్త్‌కార్డులు పంపిణీ ప్రక్రియ చేయనున్నట్లు తెలిపారు. ఇల్లెందు నియోజకవర్గంలో వర్షాలకు దెబ్బతిన్న రహదారుల వివరాలను అధికారులు ఇంకా ఇవ్వలేదని ఆగ్రహించారు.
వెంటనే వర్షాలకు దెబ్బతిన్న రహదారుల వివరాలను, వాటి ప్రతిపాదనలు వెంటనే పంపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. అటవీశాఖ అభ్యంతరాలతో అసంపూర్తిగా ఉన్న రహదారులను గుర్తించి ఆయా జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాలని అటవీశాఖ అధికారులు మంత్రి సూచనలు చేశారు. ఏజెన్సీ వాసులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, టీజీఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్లు జితీశ్ వి పాటిల్, అద్వైత్‌కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.