తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో కొత్త సమస్యలు - 90 శాతం మంది అనర్హులుగా గుర్తింపు - INDIRAMMA HOUSING PROBLEMS

హైదరాబాద్​లో కిరాయి ఇళ్లలో ఉంటున్న 90 శాతం మంది - గ్రేటర్‌లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో వెల్లడి - స్థలముంటే రూ.5లక్షల సాయం వర్తించనట్టేనా!

Indiramma Housing Problems
Indiramma Housing Problems In Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2025, 12:16 PM IST

Indiramma Housing Problems In Hyderabad : హైదరాబాద్​లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే అయోమయంగా మారింది. జీహెచ్ఎంసీ 150 డివిజన్లు, కంటోన్మెంట్ బోర్డు 8 డివిజన్ల పరిధి నుంచి 10 లక్షల కుటుంబాలు ప్రజాపాలన సభల్లో ఇళ్లు కావాలని దరఖాస్తు చేసుకున్నాయి. ఆయా కుటుంబాల అర్హతలను పరిశీలించేందుకు అధికారులు సర్వే చేపడుతుండగా దాదాపు 90 శాతం మంది అద్దె ఇళ్లలోనే ఉంటునట్లు గుర్తించారు. సొంత ఇంటి స్థలం లేనందున రూ.5లక్షల ఆర్థిక సాయం పథకానికి అనర్హులని అధికారులు తెలిపారు.

గ్రామాల్లో ఈ పరిస్థితి లేదని, హైదరాబాద్​లో భూమి ధరలు ఎక్కువగా ఉండటం వల్ల పేదలు స్థలం కొనలేని పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్​లో మురికివాడలు, పేదల బస్తీలను దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ఇళ్ల పథకం నిబంధనలను మార్చాలని ప్రజలు కోరుతున్నారు.

స్థలం లేదంటున్నారు: సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేవారికి రూ.5లక్షల ఆర్థిక సాయం, స్థలం లేనివారి కోసం 4,50,000 ఇళ్లను నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రూపొందించింది. సొంత స్థలం ఉన్నవారికే మొదట ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం చేపడుతున్న ఇంటింటి సర్వేలో వారు ఉంటున్న ఇల్లు సొంతమా?, కిరాయిదా? అనే వివరాలు తీసుకుంటున్నారు. అద్దెకు ఉంటున్నవారైతే ఇల్లు కట్టుకునేందుకు ఎక్కడైనా ఖాళీ స్థలం ఉందా అని అడుగుతున్నారు. 90శాతం మంది స్థలం లేదని తెలుపుతున్నారు.

అడ్డొస్తున్న నిబంధనలు : ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హత పొందాలంటే హైదరాబాద్ నగరంలో కనీసం 45 గజాల రిజిస్టర్డు ఇంటి స్థలం ఉండాలి. గ్రేటర్‌లో ఏ మూలకు వెళ్లినా 45గజాల చట్టబద్ధమైన ఇంటి స్థలం విలువ రూ.50లక్షలు ఉంటుంది. అంత విలువగల స్థలమున్నవారు ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షల ఆర్థిక సాయానికి ఎదురుచూడరు.

వాళ్లకు డబ్బులు సర్దుబాటవగానే రెండు, మూడు అంతస్తులు కట్టుకుంటున్నారు. నోటరీ పత్రాలతో స్థలం కొన్న పలు మురికివాడల్లోని పేద కుటుంబాలే ఇళ్లు లేక ఇబ్బందిపడుతున్నాయి. మరోవైపు నోటరీ పత్రాలతో కొన్న స్థలాలకు పథకాన్ని వర్తింపజేయడం కుదరదని అధికారులు తెలుపుతున్నారు. ఈ విషయంపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించాల్సిఉంది.

84వేల ఇళ్లు: పథకం మొదటి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన గ్రేటర్​లో 24 నియోజకవర్గాలకు 84వేల ఇళ్లు ఇవ్వాలి. సర్వేలో 10లక్షల కుటుంబాలకుగాను, ఇప్పటి వరకు 3 లక్షల ఇళ్లను పరిశీలిస్తే 90శాతం మందిని అనర్హులుగా గుర్తించారు. సొంత ఇంటి స్థలం నిబంధనతో పథకాన్ని అందుకోలేకపోతున్నామని నగరవాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల యాప్​ సర్వేలో అక్రమాలు! - తిరిగి దరఖాస్తుల పరిశీలన - ఫైనల్ లిస్ట్ ఎప్పుటంటే!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్​న్యూస్ - నెలాఖరులోగా మంజూరు

ABOUT THE AUTHOR

...view details