Priyadarshini Best Influencer Award: అమ్మభాషపై మమకారం, తెలుగుయాసపై అనురాగం ఆ యువతిని అచ్చ తెలుగు పదాలకు దగ్గర చేశాయి. దానికి తమ ప్రాంత గొప్పదనం, చారిత్రక, పర్యాటక విశేషాలు చెప్పాలనే ఆసక్తీ తోడయ్యింది. ఇంకేముంది మా ఊరి కథలు అంటూ యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టి అనతి కాలంలోనే దేశవిదేశీయులకు చేరువైంది. ఉత్తమ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ముఖ్యమంత్రి నుంచి పురస్కారం అందుకునే స్థాయికి ఎదిగింది. పర్యాటకశాఖ యూత్ ఐకాన్‌గా మారిన ఇందిరా ప్రియదర్శిని సక్సెస్ ప్రయాణమే ఇది.
పక్కింట్లో ఎవరున్నారో కూడా పట్టించుకోని రోజులివి. అలాంటిది ఉన్న ఊరు కన్నఊరితో సమానమని భావించిందీ అమ్మాయి. మరుగున పడిన రాయలసీమ చరిత్ర అందరికీ తెలియజేయాలని సంకల్పించింది. సంప్రదాయ వస్త్రధారణ, శ్రావ్యమైన కంఠంతో ఆధ్యాత్మిక, పర్యాటక విశేషాలు వర్ణిస్తూ నెటిజన్ల అభిమానం సొంతం చేసుకుంది. వ్లోగ్స్ ద్వారా విదేశీయులను ఆయా ప్రాంతాలకు రప్పిస్తూ, రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి తోడ్పడుతోంది.
తేట తెలుగులో స్పష్టంగా, ఆకట్టుకునేలా మాట్లాడుతున్న ఇందిరా ప్రియదర్శినిది అనంతపురం జిల్లా మామిళ్లపల్లె. ప్రస్తుతం వీరి కుటుంబం కడపలో నివసిస్తోంది. తండ్రి రాజేష్ పాత్రికేయుడు. ఉద్యోగా రీత్యా తెలుగురాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో పని చేశారు. రాయలసీమ, తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలిచే అనేక విషయాలు ఆమె తండ్రి ప్రత్యేకంగా సేకరించేవారు. దీంతో చిన్నప్పటి నుంచే వివిధ యాసలపై ఆసక్తి పెంచుకుంది ఇందిర.
కొవిడ్ సమయంలో రాయలసీమ యాసలో కొన్ని కథలు రచించాడు ఇందిర తండ్రి. ఎంతో నచ్చిన ఆ కథల్ని అందరికీ తానే చదివి వినిపించాలని భావించింది. 'ఇందూస్ మా ఊరి కథలు' పేరిట యూట్యూబ్ ఛానెల్ తెరిచి అప్‌లోడ్ చేసింది. వీక్షకుల నుంచి అనూహ్య స్పందనతో చాలా సంతోషపడింది. ఆ ఉత్సాహంతో ఇంకేదైనా కొత్తగా ప్రయత్నించాలని ఆలోచించింది.
బాల్యం నుంచి కుటుంబంతో కలిసి ఎన్నో ఆలయాలు, పర్యాటకప్రాంతాలు సందర్శించింది ఇందిర. ఆయా ప్రాంతాల చరిత్ర, విశిష్టత తండ్రిని అడిగి తెలుసుకోవడం అలవాటుగా చేసుకుంది. రాయలసీమలో చూసిన గొప్ప గొప్ప ప్రాంతాల గురించి చాలామందికి తెలియదంటే ఆశ్చర్య పోయింది. మరుగునపడుతున్న ఆ వైభవం అందరికీ తెలిసేలా చేయాలని నిశ్చయించుకుంది.