Polio Victim Underwent a Heart Transplant at Kamineni Hospital :భారతదేశలోనే మొట్టమొదటిసారిగా ఒక పోలియో బాధితుడికి ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా గుండెమార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన 45 ఏళ్ల భాస్కర్ వృత్తిపరంగా టైలర్. అతడు తీవ్రమైన గుండెవ్యాధితో బాధపడుతున్నాడు. గత మూడేళ్లుగా అతడి పాక్షిక పోలియో కారణంగా పరిస్థితి మరింత విషమించింది.
దాంతో ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి రాగా, ఇక్కడి గుండెమార్పిడి విభాగాధిపతి, కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ విశాల్ వి. ఖంటే, కన్సల్టెంట్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ రాజేశ్ తదితరులతో కూడిన వైద్య బృందం ఈ అసాధారణ శస్త్రచికిత్సను విజయవంతం చేసింది. ఆసుపత్రిలో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాల సామర్థ్యాన్ని ఇది నిరూపించింది.
జీవన్ దాన్ సహకారంతో భాస్కర్‌కు పునర్జన్మ : భాస్కర్ గుండె సరిగా పనిచేయకపోవటంతో రక్తం తగినంత సరఫరా కావటం లేదని గుర్తించిన వైద్యులు, అతడికి గుండె మార్పిడి చికిత్స చేయాలని నిర్ణయించారు. జీవన్ దాన్‌లో రిజిస్టర్ చేయగా, ఇటీవల ఓ జీవన్మృతుడి నుంచి సేకరించిన గుండెను జీవన్ దాన్ సహకారంతో భాస్కర్‌కు అమర్చారు. దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి భాస్కర్‌కు శస్త్రచికిత్స పూర్తి చేసినట్టు వైద్యులు ప్రకటించారు. ఆపరేషన్ చేసి దాదాపు మూడు నెలలు కావస్తుండగా ప్రస్తుతం భాస్కర్ ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు.
"శస్త్రచికిత్స విజయవంతం కావడంతో భాస్కర్ వేగంగా కోలుకుంటున్నాడు. అతడి రోజువారీ కార్యకలాపాలు క్రమంగా చేసుకోగలుగుతున్నాడు. గతంలో తీవ్రమైన అలసట కారణంగా మంచానికే పరిమితమైన అతడు ఇప్పుడు కాస్త దూరాలు నడవగలుగుతున్నాడు. సాధారణ జీవితంలోకి తిరిగి అడుగు పెడతాడు. అయితే, శస్త్రచికిత్స అనంతరం భాస్కర్‌ను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది, కొత్త హార్ట్‌ను శరీరం తిరస్కరించకుండా ఉండేందుకు మందులు వాడుతుండాలి. అతడి పరిస్థితిని మా బృందం నిరంతరం పరిశీలిస్తోంది."-విశాల్ వి. ఖంటే, కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్