Indians Rescued From Cyber Fraud Rackets in Cambodia:కాంబోడియాలో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను ఏజెంట్లు నమ్మించారు. ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షల చొప్పున వసూలు చేశారు. అనంతరం వారిని చైనా, కాంబోడియా కంపెనీలకు చెందిన ఏజెంట్లకు అప్పగించారు. భారతీయులే లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడటంపై బాధితులకు సదరు ఏజెంట్లు శిక్షణ ఇచ్చారు. తిరస్కరించినా, ఎదురుతిరిగినా చిత్రహింసలకు గురిచేశారు. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో మానవ అక్రమ రవాణా విషయం వెలుగులోకి వచ్చింది.
విచారణ జరిపిన విశాఖ పోలీసులు కాంబోడియాలోని భారత రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాలశాఖ సహకారంతో కొందరు బాధితులకు విముక్తి కల్పించారు. శుక్రవారం రెండు విమానాల్లో విశాఖ చేరుకున్న 24 మందికి విశాఖ పోలీసు కమిషనర్ రవిశంకర్ స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు.
భవిష్యత్‌లో జరగకుండా చర్యలు: ‘విదేశీ వ్యవహారాలశాఖ, భారత రాయబార కార్యాలయం ప్రతినిధుల సహకారంతో బాధితులను క్షేమంగా రప్పించేందుకు చర్యలు తీసుకున్నాం. తొలి విడతగా ఒక విమానంలో 10 మంది, మరో విమానంలో 14 మంది విశాఖ చేరుకున్నారు. వారు క్షేమంగా ఇళ్లకు చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విశాఖ జాయింట్ కమిషనర్ డా. ఫకీరప్ప నేతృత్వంలో అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇక్కడి ఏజెంట్లు, కాంబోడియా ఏజెంట్లకు మధ్య ఒప్పందాల గురించి విచారణలో తెలుస్తుంది. మొత్తం 70 మంది ఏజెంట్లు, సబ్‌ఏజెంట్లకు నోటీసులు పంపించాం. నిందితులపై చర్యలు తీసుకుంటాం. చైనా ఏజెంట్లు, వారు కొల్లగొట్టిన డబ్బును పంపిన ఖాతాల వివరాలను సేకరిస్తున్నాం. బాధితుల ఫోన్లలో తీసిన చిత్రాలు, సేకరించిన వివరాలతో విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో కాంబోడియా ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తాం’ అని సీపీ రవిశంకర్ తెలిపారు.
మోసం ఎలా చేయాలో శిక్షణ : విశాఖకు చేరుకున్న బాధితుల నుంచి పోలీసులు ప్రాథమిక సమాచారం సేకరించారు. వాటి ప్రకారం చైనా ఏజెంట్లు తొలుత బాధితుల పాస్‌పోర్టులు లాగేసుకున్నారు. భారత్‌పై సైబర్ నేరాలకు ఎలా పాల్పడాలో 7 నుంచి 10 రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ఫెడెక్స్ కొరియర్, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ, ఆన్‌లైన్‌లో ఉద్యోగ ప్రకటనల పేరిట భారతీయులను ఎలా మోసగించాలో నేర్పించారు. ఇప్పటికే విశాఖ సిటీ నుంచి రూ.120 కోట్లు కొల్లగొట్టారు. తాజాగా ఫెడెక్స్ కొరియర్ పేరిట విశాఖకు చెందిన మహిళ ఖాతా నుంచి రూ.3.2 కోట్లు కొట్టేశారు.