Dussehra Festival in Telangana :పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లినప్పుడు జమ్మి చెట్టుపైనే ఆయుధాలను ఎవరికీ కనిపించకుండా దాస్తారు. దసరా పండుగ రోజున అజ్ఞాతవాసం పూర్తి అయిన తర్వాత జమ్మి చెట్టుకు పూజించి ఆయుధాలను తీస్తుండగా పాలపిట్టను చూస్తారు. అప్పటి నుంచి జమ్మి చెట్టుకు పూజించి, పాలపిట్టను చూస్తే ఆ ఏడాది అంతా శుభమే జరుగుతుందని చాలా మంది భావిస్తారు. అయితే ఇప్పుడు పాలపిట్టల సంఖ్య తగ్గిపోవడంతో వాటిని పంజరాల్లో బంధిస్తున్నారు.
పాలపిట్ట రాష్ట్రపక్షి. ఇలా స్వేచ్ఛగా తిరగాల్సిన పాలపిట్టను పంజరాల్లో బంధించడం ఏంటని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. విజయదశమి రోజున దీనిని చూస్తే మంచి జరుగుతుందని, విజయాలు వస్తాయని చాలా మందిలో ఉన్న నమ్మకాన్ని కొందరు ఇలా సొమ్ముగా చేసుకుంటున్నారు. దీంతో పాలపిట్టల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోతున్నాయి. రాజధాని పరిధిలోని కేవలం మూడు జిల్లాల్లో సంతరిస్తున్న అతి ప్రాధాన్యమున్న 104 పక్షి జాతుల్లో పాలపిట్ట ఒకటి.
ఈ జిల్లాల పరిధిలో గత ఏడాది 400 వరకు పాలపిట్టలు ఉండేవి. కానీ ప్రస్తుతం వాటి సంఖ్య 300లకు పడిపోయినట్లు బర్డింగ్ పల్స్ సంస్థ ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. అదే క్రమంలో పాలపిట్టల సంఖ్య తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోందని స్టేట్ ఆఫ్ ఇండియా బర్డ్స్ నివేదిక సైతం వెల్లడించింది. పాలపిట్టలు ప్రస్తుతం ఐయూసీఎన్ రెడ్ జాబితాలో ఉన్నాయి. పాలపిట్టను కాపాడుకోకపోతే ఆ జాతి పక్షులు మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.