Summer Special Trains : మీరు వేసవిలో విహార యాత్రకు, తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్న్యూస్. భారతీయ రైల్వే వేసవికాలంలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైలు సేవలు అందిస్తోంది. వేసవిలో రికార్డు స్థాయిలో 9,111 రైలు ట్రిప్పులను నడిపిస్తుంది. 2023 ఏడాది వేసవి కాలంలో 6,369 ట్రిప్పులను తిప్పింది. ఈ ఏడాది వేసవి సీజన్లో 2,742 ట్రిప్పులు అదనంగా నడుపుతున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైలు సేవలను విస్తరించినట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది.
దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన రైలు మార్గాల్లో రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. దేశంలోని అన్ని జోన్లలో ఈ రైల్వే సేవలు అందుబాటులో ఉంటాయి. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, బంగాల్, బిహార్, ఉత్తర్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, దిల్లీ వంటి రాష్ట్రాల నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఈ రైళ్లను నడిపిస్తున్నారు.
కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
1079 Special Train Services :వేసవిలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఏప్రిల్, మే మాసాల్లో 1,079 ప్రత్యేక రైలు సేవలను ప్రకటించింది. ఉత్తర, తూర్పు దిశలలో ఉన్న సికింద్రాబాద్ - దానాపూర్ , హైదరాబాద్ - గోరఖ్‌పూర్, కాచిగూడ - కొచ్చువేలి , సికింద్రాబాద్ - అగర్తల , సికింద్రాబాద్ - సంత్రాగచ్చి , సికింద్రాబాద్ - షాలిమార్ , సికింద్రాబాద్ - పట్నా, తిరుపతి – షిర్డీ, కాచిగూడ – మధురై, సికింద్రాబాద్ - కొల్లాం, హైదరాబాద్ – కటక్, హైదరాబాద్ - రక్సాల్ మొదలైన ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్ల సేవలు అందించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. వీటితోపాటు సెలవుల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రయాణికుల కోసం ముఖ్యనగరాల మధ్య ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
- సికింద్రాబాద్ - తిరుపతి
- లింగంపల్లి - కాకినాడ
- హైదరాబాద్ - నర్సాపూర్
- తిరుపతి - విశాఖపట్నం,
- సికింద్రాబాద్ - విశాఖపట్నం