Rakul Preet Reaction on Minister Konda Surekha Words :మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న క్రమంలో ఆమె తీవ్ర పదజాలం ఉపయోగించారు. కేటీఆర్ కారణంగా కొంతమంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్‌సింగ్ పేరును కూడా ఆమె ప్రస్తావించారు. సమంత, నాగచైతన్య, నాగార్జున పేర్లును కూడా తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన సినీ ప్రముఖులు మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. ఆమె మాటల పట్ల తీవ్రంగా విచారం వ్యక్తం చేశారు. తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ కూడా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
సృజనాత్మకత, వృత్తి నిపుణతకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రపంచ ప్రసిద్ధి చెందిందని, ఈ అందమైన తెలుగు ఇండస్ట్రీలో నాది గొప్ప ప్రయాణమని రకుల్ ప్రీత్‌సింగ్ ఎక్స్ వేదికగా వివరించారు. ఇప్పటికీ ఇండస్ట్రీతో సత్సంబంధాలు కలిగి ఉన్నానని తెలిపారు. ఒక మహిళపై దారుణమైన, దుర్మార్గమైన నిరాధార ఆరోపణలు చేయడం విని బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మరో మహిళ ఇలా వ్యాఖ్యానించడం మరింత బాధించిందని వ్యాఖ్యానించారు.
కల్పిత కథనాలను సృష్టించవద్దు : హుందాగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే తామంతా నిశ్శబ్దంగా ఉన్నామని రకుల్ ప్రీత్‌సింగ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కానీ, అదే తమ బలహీనత అనుకోవద్దని హెచ్చరించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తినని, తనకు ఏ వ్యక్తి లేదా రాజకీయ పార్టీతో సంబంధం లేదని రకుల్ ప్రీత్‌సింగ్ వెల్లడించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేశారు. నటులు, సృజనాత్మకత కలిగిన వ్యక్తులను రాజకీయాలకు దూరంగా పెట్టండని కోరారు. వార్తల్లో నిలిచేందుకు వారి పేర్లను వాడుకొని కల్పిత కథనాలను సృష్టించవద్దని మండిపడ్డారు.
హుందాతనాన్ని నిలబెట్టుకోండి : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై దర్శకుడు రాజమౌళి సైతం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. హుందాతనాన్ని నిలబెట్టుకోండని, గౌరవప్రదంగా వ్యవహరించండని హితవు పలికారు. నిరాధార ఆరోపణలు సహించలేనివని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ప్రతినిధులు చేసినప్పుడు అని వ్యాఖ్యానించారు. మరోవైపు అక్కినేని కుటుంబం సైతం మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠ దెబ్బతీసేలా మంత్రి సురేఖ వ్యాఖ్యలు చేశారని నాగార్జున పరువు నష్టం దావా వేశారు.
'సినిమా వాళ్లను టార్గెట్ చేయడం సిగ్గుచేటు - అందరి కుటుంబాల్లాగే మాకూ గౌరవం, రక్షణ అవసరం' - chiru response on KONDA comments