India Popular Cities Facing Water Crisis : మనిషి కనీస అవసరాల్లో ఒకటైన నీరు పేరు చెబితే ప్రజలకు కన్నీరు వస్తోంది. నీటి కొరతతో బెంగళూరు పేరు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నా దేశంలోని అనేక నగరాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది. దేశ రాజధాని దిల్లీ సహా ముంబయి, హైదరాబాద్, చెన్నై, జైపూర్ సహా అనేక నగరాల్లో ఇదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలు ఇప్పటికే నీటి కొరతతో అల్లాడుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాలు తక్షణమే చర్యలు తీసుకోకుంటే జల ఘోషతో దేశంలోని అనేక నగరాలు విలవిలలాడే పరిస్థితులు ఏర్పడ్డాయి.
దేశానికి వాణిజ్య రాజధాని ముంబయి. ఈ నగరానికి చుట్టుపక్కల ఏడు చెరువుల నుంచి నీటి సరఫరా జరుగుతుంది. అయితే అవి అడుగంటిపోవడంతో ముంబయి నగరం నీటి కొరత ముప్పున నిలిచి ఉంది. గత ఏడాది వానాకాలంలో వర్షాలు సరిగా కురవకపోవడంతో జలాశయాలు నిండలేదు. దీంతో ఇప్పటి వరకు ఉన్న నిల్వలు అన్నింటినీ వాడుకోవడంతో అవి ఖాళీ అయ్యాయి. నిల్వలన్నీ చివరి దశకు చేరుకోవడంతో బృహన్ ముంబయి కార్పొరేషన్ అధికారులు సరఫరాలో కోతలు విధిస్తున్నారు. దీనికి తోడు పెరిగిన పట్టణీకరణ, మౌలిక సదుపాయాలు అస్తవ్యస్తంగా మారడంతో ముంబయిలో నీటి కొరత ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.
Water Problem in Rajasthan : ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఆ రాష్ట్ర రాజధాని జైపూర్ ఇప్పటికే నీటి కొరతతో అల్లాడుతోంది. జైపూర్ నీటి అవసరాల కోసం రామ్‌ఘర్ జలాశయంపై ఆధారపడుతోంది. 20శతాబ్దంలో నిర్మించిన ఈ డ్యామ్ కాలక్రమంలో దెబ్బతింటూ వస్తోంది. ఎక్కువ నీటిని నిల్వ చేయలేని పరిస్థితి. దీంతో సాధారణ సమయంలోనేనీటి కొరత ఏర్పడుతుండగా, ఇప్పుడు వేసవి రావడంతో పరిస్థితి మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.
ఆ కాలనీలో 25 ఏళ్ల నుంచి నో వాటర్ ప్రాబ్లమ్ - ఎందుకో తెలుసా? - Precautions to Avoid Water Crisis
తమిళనాడు రాజధాని చెన్నై నగరం కూడా నీటి సంక్షోభం ముంగిట నిలిచింది. 14వందల మిల్లీమీటర్ల వార్షిక వర్షపాతం కురిసినా ఇటీవల కాలంలో పట్టణీకరణ, పారిశ్రామికీకరణ పెరగడంతో నీటి కష్టాలు పెరిగాయి. ప్రతి నిత్యం పది మిలియన్ లీటర్లను సరఫరా చేస్తుండగా అవి నగరవాసుల అవసరాలను ఏమాత్రం తీర్చడం లేదు. చెన్నై మహానగరానికి నీరు అందించే ఆరు జలాశయాల్లో 8వేల 384మిలియన్ క్యూబిక్ అడుగుల కంటే ఎక్కువ నీరు ఉందని, 8నెలల వరకు అవసరాలు తీరుతాయని చెన్నై జలమండలి అధికారులు తెలిపారు. ఇటీవల నెమ్మెలిలో 150 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసే కేంద్రాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. అయితే ప్రస్తుతానికి ఇలా ఉన్నా ఎండలు ముదిరితే చెన్నైలో నీటి కొరత ముదిరే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.
రాజధానిలో ఇది పరిస్థితి :దేశానికి రాజధాని అయినా దిల్లీ నగరాన్ని నీటి కొరత వీడడం లేదు. దిల్లీకి 60శాతం నీటిని యమునా నది నుంచి జల్‌బోర్డు సరఫరా చేస్తోంది. మిగతా అవసరాలకు బోర్లపై ఆధారపడతారు. అయితే భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో అనేక బోర్లలో నీరు రావడం లేదు. ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూకు కూడా నీటి కొరత ప్రమాదం ఏర్పడింది. లఖ్‌నవూకు గోమతి, దాని ఉప నదుల నుంచి నీటి సరఫరా జరుగుతూ ఉండగా అవి ఎండిపోయాయి.
పంజాబ్‌లోని భటిండా నగరం కూడా తీవ్ర తాగు నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. అయితే సాగు అవసరాలకు ఎక్కువ నీటిని వినియోగిస్తూ ఉండడంతో తాగు నీటికి కొరత ఏర్పడింది. ఇలా దేశంలోని ఆరు ప్రధాన నగరాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఎండలు పెరిగితే సమస్య ఇంకా ముదిరే అవకాశం కనిపిస్తోంది.
కేంద్ర జలసంఘం వెల్లడించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 150 జలాశయాల్లోనీటి నిల్వలు వాటి సామర్థ్యంలో 38శాతానికి పడిపోయాయి. ఇది గత దశాబ్ద కాలపు సగటు కంటే తక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. 150 రిజర్వాయర్ల పూర్తి సామర్థ్యం సుమారు 178 బిలియన్ క్యూబిక్ మీటర్లు కాగా ప్రస్తుతం 67బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు మాత్రమే ఉంది.