India Vs Bangladesh T20 Tickets :టీమిండియా - బంగ్లాదేశ్ మధ్య ఈనెల 12న ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే టీ 20 3వ మ్యాచ్ టికెట్లను శనివారం నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పేటీఎం ఇన్సైడర్ వెబ్సైట్, యాప్లో టికెట్లు విక్రయానికి పెడుతామని వెల్లడించారు.
టికెట్ల ప్రారంభ ధర రూ.750 నుంచి రూ.15 వేల వరకు ఉంటాయని ఆయన తెలిపారు. ఆన్లైన్లో ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారు ఈనెల 8వ తేదీ నుంచి 12 వరకు జింఖానా స్టేడియంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల వరకు రిడంప్షన్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడీ కార్డు చూపించి, ఆన్‌లైన్ టికెట్ బుక్ చేసుకున్న ప్రింట్ చూపించి టికెట్లు పొందాలని కోరారు. అదేవిధంగా మ్యాచ్ టిక్కెట్లను ఆఫ్లైన్ కౌంటర్లలో విక్రయించడం లేదని స్పష్టం చేశారు.
Rachakonda CP On India Vs Bangladesh Match :క్రికెట్ అభిమానులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మ్యాచ్ ఏర్పాట్లు పూర్తి చేశామని రాచకొండ పోలీస్ కమీషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈనెల 12న జరగనున్న టీ 20 క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు పైన సీపీ సుధీర్ బాబు స్టేడియంలో డీసీపీలు, ఏసీపీలు, జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోపాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.