Steel Flyover in Yadagirigutta : యాదగిరిగుట్ట వద్ద మెకలై స్టీల్‌తో నిర్మిస్తున్న 64 మీటర్ల లింక్ ఫ్లైఓవర్ పనులు దాదాపు 5 నెలలుగా జరగడం లేదు. రానున్న మూడు నెలల్లో అసంపూర్తి పనులు పూర్తి చేయాలని గతేడాది సెప్టెంబరు 18న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంబంధిత అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ పనులలో ఎలాంటి చలనం లేకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
యాదగిరిగుట్టలో సుందరంగా తీగెల వంతెన (మెకలై స్టీల్ ఫ్లైఓవర్) నిర్మాణ పనులు పూర్తి చేయాలని గతంలో ప్రభుత్వం సంకల్పించింది. యాదగిరి గుట్టపై ప్రధానంగా రవాణా రద్దీని క్రమబద్ధీకరించి సాఫీగా దర్శన ఏర్పాట్లు జరిగేలా భారీ పై వంతెన నిర్మించేందుకు ఐదేళ్ల క్రితమే నిర్ణయం జరిగింది. 2020 నవంబరులో రూ.34 కోట్ల అంచనాతో ఈ వంతెన త్వరితగతిన నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అనంతరం వెంటనే నిర్మాణ పనులు కూడా ప్రారంభమైయ్యాయి. మొత్తం 450 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఈ పనులు కొద్ది మేర జరిగాయి. ఇప్పటికే 386 మీటర్ల మేర పై వంతెన పనులు జరిగాయి. ఇంకా 64 మీటర్ల పై వంతెన లింక్ పనులు జరగాల్సి ఉంది.
గుట్టపై పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ :హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు గుట్టకు రాగానే వైకుంఠ ద్వారం నుంచి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న మార్గం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కార్లు, బస్సులు, ఇతరత్రా భారీ వాహనాలు గుట్టకు కుడివైపు మార్గం నుంచి పైకి వెళుతున్నాయి. ప్రస్తుతం వీరికి రాకపోకలు ఐచ్చికమైనప్పటికి వచ్చేప్పుడు మాత్రం పాత ఘాట్‌రోడ్డు నుంచి గుట్ట దిగి వెళుతున్నాయి.