ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో పడకేసిన పారిశుద్ధ్యం- మృత్యుపాశాలుగా మారుతున్న డ్రైనేజీలు - Danger with Open Drains At VJA

Incomplete Drainage Structures at Vijayawada: బెజవాడలోని ఓపెన్‌ డ్రైనేజీలు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. గత రెండు సంవత్సరాలలో ఇద్దరు చిన్నారులు సహా ఓ ఆటో డ్రైవర్ మురుగు కాల్వల్లో పడి మృతి చెందారు. ఓపెన్‌ డ్రైన్‌ల వల్ల చిన్నారులకు ప్రమాదం పొంచి ఉన్నా వీఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Incomplete Drainage Structures at Vijayawada
Incomplete Drainage Structures at Vijayawada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 21, 2024, 9:31 AM IST

Incomplete Drainage Structures at Vijayawada:విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్యం పడకేసింది. ఓపెన్‌ డ్రైనేజీలు మృత్యుపాశాలుగా మారాయి. రెండేళ్లలో ఇద్దరు చిన్నారులు సహా ఓ ఆటో డ్రైవర్ మురుగు కాల్వల్లో పడి మృతి చెందారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయవచ్చు. ప్రమాదాలు జరిగినప్పుడే వీఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు హడావుడి చేస్తున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు వస్తున్న దృష్ట్యా ఓపెన్‌ డ్రైన్‌ల వల్ల చిన్నారులకు ప్రమాదం పొంచి ఉంది. వాన నీటి కాల్వల ఆధునీకరణకు కేంద్రం నిధులిచ్చినా ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోవడంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

మహానగరంలో మురుగు సమస్య - బెజవాడ అభివృద్ధికి బ్రేకులు

Not Care The Municipal Corporation Authorities: విజయవాడ నగరంలో 1237 ఓపెన్ డ్రెనేజీలు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్‌ ఉన్న ఇళ్లు 1.01 లక్షలు ఉండగా లేని ఇళ్లు 1.09 లక్షలు ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. డ్రైనేజీల్లో మురుగు నీరు ప్రవాహం సాఫీగా సాగక పోవడం వల్ల చిన్నపాటి వర్షానికే మురుగునీరు రోడ్లపై పారుతోంది. గురునానక్ కాలనీలో ఓ ఐదు సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ ఓపెన్ కాలువలో పడి మృతి చెందాడు. ఆ తర్వాత కొన్ని నెలలకే సింగ్ నగర్ ప్రాంతంలో మరో బాలుడు ఓపెన్ డ్రైనేజీలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల వాంబేకాలనీలోని వీఎంసీ ఔట్ ఫాల్ డ్రైన్‌లో పడి అప్పన్న అనే ఆటో డ్రైవర్ మృతి చెందాడు. కొన్ని కాలనీల్లో ఓపెన్ డ్రైన్లు ప్రమాదకరంగా ఉన్నాయని అంగీకరిస్తున్న వీఎంసీ అధికారులు (Vijayawada Municipal Corporation Authorities), అధికార పార్టీ ప్రజాప్రతినిధులు శాశ్వత పరిష్కార చర్యలపై మాత్రం దృష్టిపెట్టడం లేదు.

అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ - ఇళ్లల్లోకి వస్తున్న మురుగు నీరు, పట్టించుకోని అధికారులు

అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాలు: విజయవాడలో వాన నీటి కాలువల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 461 కోట్ల రూపాయలు కేటాయించింది. 2017 ఏప్రిల్‌లో ఎల్‌ అండ్‌ టీ సంస్థ పనులు ప్రారంభించింది. నగరంలోని 59 డివిజన్లలో 440 కిలోమీటర్ల పొడవైన కాలువలు నిర్మించాలనేది ప్రభుత్వ ప్రణాళిక. ఇందులో 252 కిలోమీటర్ల పొడవైన కాలువలను మాత్రమే పూర్తి చేశారు. కేంద్రం ఇచ్చిన నిధుల్లో 172 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. ఆ తర్వాత చేతులెత్తేశారు. ప్రభుత్వం సహకరించకపోవడంతో విసిగిపోయిన ఎల్‌అండ్‌టీ సంస్థ పనులు వదిలేసి వెళ్లిపోయింది. 2021 నుంచి ఎక్కడి నిర్మాణాలు అక్కడే నిలిచిపోయాయి. చినుకు పడితే విజయవాడ మురికికూపంలా మారిపోతోంది.

ముంచెత్తుతున్న మురుగు, ఓపెన్ నాలాలు- మహానగరంలో కాలనీల పరిస్థితి ఇది

ఓపెన్‌ డ్రైన్లతో పొంచి ఉన్న ప్రమాదం:మరికొన్ని రోజుల్లో విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. ఓపెన్‌ డ్రైనేజీల పక్కనే చిన్నారులు ఆడుకునేందుకు ఎక్కువ అవకాశం ఉంది. బస్తీల్లో ఉపాధి కోసం తల్లిదండ్రులు బయటకు వెళ్తే పిల్లలపై పర్యవేక్షణ ఉండదు. ఓపెన్‌ డ్రైన్లతో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. విజయవాడలో మురుగు నీటి సరఫరా వ్యవస్థను 30 ఏళ్ల క్రితం నిర్మించారు. జనాభా విపరీతంగా పెరగడంతో అప్పటి నిర్మాణాలు సరిపోవడం లేదు. మురుగునీటి వ్యవస్థను ఆధునీకరించాలని కోరుతున్నా అధికార పార్టీ నుంచి స్పందన లేదని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వీఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధుల స్పంధించి ఓపెన్ డ్రైనేజీలకు శాశ్వత పరిష్కారం చూపాలని బెజవాడ ప్రజలు కోరుతున్నారు.

వీఎంసీ ఓపెన్‌ డ్రైనేజీలో పడి ఆటోడ్రైవర్ మృతి - మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని సీపీఎం డిమాండ్​

ABOUT THE AUTHOR

...view details