Registration Revenue Decreased In Telangana : తెలంగాణ రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం సెప్టెంబర్ నెలలో భారీగా పడిపోయింది. హెడ్రా ఇష్యూ కూడా రిజిస్ట్రేషన్లు తగ్గడానికి కారణంగా భావిస్తున్నారు. గత నెలలో ఏకంగా 26 శాతానికిపై రాబడి, 20శాతం రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు ఆరు నెలల్లో గత ఏడాది కంటే రాబడి పెరగాల్సి ఉండగా ఏకంగా రూ.300 కోట్లకుపైగా ఆదాయం పడిపోయింది.
వ్యవసాయ భూములు విక్రయాలు తగ్గడంతో :తెలంగాణ రాష్ట్రంలో 2024-25 ఆర్థిక ఏడాదిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రూ.18,500 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఆ మేరకు ఆ శాఖకు లక్ష్యంగా కూడా నిర్దేశించింది. కానీ గడిచిన ఆరు నెలల్లో వచ్చిన ఆదాయం చూస్తే ఆశించిన మేర రాలేదని స్పష్టం అవుతోంది. స్థిరాస్తి క్రయవిక్రయాలతో పాటు వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు కూడా పడిపోయాయి.
గతేడాది కంటే పోలిస్తే భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్లు : ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు 6 నెలల్లో 43వేలు వ్యవసాయ రిజిస్ట్రేషన్లు, 40వేలకుపైగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు తగ్గినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో వ్యవసాయ భూములు క్రయవిక్రయాలు తగ్గడంతో రూ.121.49 కోట్లు రాబడి తగ్గగా వ్యవసాయేతర భూములు, భవనాలు క్రయవిక్రయాలు తగ్గినా ఆదాయం మాత్రం రూ.154 కోట్లు పెరిగింది. ఇక్కడ వ్యవసాయ, వ్యవసాయేతర క్రయవిక్రయాలు తీసుకుంటే గత ఏడాది ఆరు నెలల కంటే 80వేలకుపైగా రిజిస్ట్రేషన్లు తగ్గినా ఆదాయం మాత్రం రూ.32 కోట్లు అదనంగా వచ్చింది.
జనవరి నుంచి సెప్టెంబర్ వరకు నెలల వారీగా జరిగిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య, తద్వారా వచ్చిన ఆదాయాలను పరిశీలిస్తే ఏప్రిల్‌లో 1.22 లక్షలు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి తద్వారా రూ.1,045 కోట్లు, మే నెలలో 1.46లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి తద్వారా రూ.965 కోట్లు, జూన్ నెలలో 1.67లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి తద్వారా రూ.1,129.53 కోట్లు, జులైలో 2.04లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లకు రూ.1,531.32 కోట్లు రాబడి వచ్చింది.