Effects Of Noise Pollution On Human :భారీ బైక్‌ల వినూత్నమైన హారన్లు, వాటి నుంచి విడుదలయ్యే సైలెన్సర్ ధ్వనిపై యువతకు ఉండే క్రేజ్ రోడ్డుపైకి వచ్చే వారి పాలిట శాపంగా మారుతోంది. భారీ శబ్దాలు చేస్తూ ద్విచక్ర వాహనాలు దూసుకెళ్తున్న తీరుతో ప్రజల గుండెలు జళ్లుమంటున్నాయి. ధ్వని, వాయు కాలుష్యాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ మధ్యకాలంలో భారీ శబ్దాలతో దూసుకెళ్లేటువంటి వాహనాలు ఎక్కువయ్యాయి. హారన్ల శబ్దాలతో మోత మోగిస్తున్నారు. వీటి కారణంగా ప్రజలు ఈ బాధలను నిత్యం ఎదుర్కొంటున్నారు. ఒరిజినల్ సైలెన్సర్లను తీసి ఎక్కువ శబ్దం వచ్చే వాటిని అమర్చుకొని ట్రెండ్ అనుకుని మురిసిపోతున్నారు. పోలీసు, రవాణాశాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఆకతాయిల ఆగడాలకు కళ్లెం వేయాల్సిన అవసరంపై ప్రత్యేక కథనం.
తనిఖీ చేస్తున్నప్పటికీ : వాహనాల తనిఖీ సమయంలో ట్రాఫిక్ పోలీసులు శబ్ద కాలుష్యం చేస్తున్న బుల్లెట్ బండ్లను పట్టుకొని ఠాణాకు తరలిస్తున్నారు. ఎక్కువ శబ్దం వెలువరించే సైలెన్సర్‌ను పోలీస్‌స్టేషన్‌లోనే మార్చుకొని తీసుకెళ్లాలనే నిబంధనను కఠినంగా అమలు చేసున్నప్పటికీ యువతలో మార్పు రావడంలేదు. పోలీసులతో పాటు రవాణాశాఖ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఈ ప్రాంతాల్లో హారన్ కొట్టొద్దు : రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో ముందు ఏదైనా వాహనం వస్తే అడ్డుగా ఉన్న వాహనాలు పక్కకు వెళ్లేందుకు సాధారణంగా వాహనదారులు హారన్ కొడుతుంటారు. కానీ హాస్పిటళ్లు, విద్యాలయాలు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు, ప్రార్థనాలయాలు, పర్యావరణ ప్రాంతాల్లో హారన్ కొట్టడమనేది నిషేధం. దీనిపై పోలీసులు, రవాణాశాఖ అధికారులు అవగాహన కల్పించాలి.
రిజిస్ట్రేషన్ తరువాత : భారీ ద్విచక్రవాహనాలను కంపెనీలు రూల్స్ మేరకే తయారు చేస్తాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం సైలెన్సర్‌లో మఫ్లర్‌ను తీసేస్తుంటారు. భారీగా శబ్దం వచ్చేటువంటి సైలెన్సర్, వివిధ రకాలుగా వచ్చే హారన్‌ను అమర్చుకొంటున్నారు. రాత్రి, పగలు అంటూ తేడా లేకుండా దూసుకెళ్లడం వల్ల రోడ్డుపై వెళ్లే యువతులు, మహిళలు వింతగా పెద్దగా వచ్చే శబ్దాలతో ఉలిక్కిపడుతున్నారు. జంతువులు అరిచినట్లు, ఒకేసారి పెద్దగా శబ్దం రావడం, చిన్న వాహనాలకు భారీ వాహనాల హారన్, వింత హారన్లతో రోడ్లపై ఉన్నవారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.