Telangana Rainfall Alert Update :బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతుండడంతో అధికంగా వీస్తున్న తూర్పు గాలుల వల్ల రాష్ట్రంలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అనేక చోట్ల, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
హైదరాబాద్లో వర్షాలు :ఇవాళ తెల్లవారుజాము నుంచే భాగ్యనగరంలోని పలు ప్రాంతాలతో పాటు జిల్లాల్లోనూ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. తుఫాన్ కారణంగా ఒక్కసారిగా నగరంలో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్, అమీర్పేట్, సనత్ నగర్, బోరబండ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురిశాయి.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం :మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చిరు జల్లులు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. రాత్రి నుండి బుధవారం ఉదయం వరకు కురుస్తున్న జల్లులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. డోర్నకల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో కురిసిన అకాల వర్షానికి పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.