తెలంగాణ

telangana

రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు- ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ - TELANGANA WEATHER REPORT

By ETV Bharat Telangana Team

Published : Aug 21, 2024, 4:06 PM IST

Telangana Weather Report : పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీరందాడటంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు యెల్లో హెచ్చరికలను జారీ చేసింది.

Telangana Weather Report
Rain Alert in Telangana (ETV Bharat)

Rain Alert in Telangana : వాయువ్య బంగాళాఖాతం దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తెల్లవారుజామున పూరీ, చిలుకా లేక్ మధ్య తీరాన్ని దాటినట్లు హైదారాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయుగుండం పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతున్నట్లు తెలిపింది. వాయుగుండం తీరం దాటడంతో ఆ ప్రభావం ఎక్కువగా ఒడిస్సా, ఛత్తీస్​గఢ్​లపైన చూపనున్నట్లు వెల్లడించింది.

తెలంగాణపై ప్రభావం : వాయుగుండం ప్రభావం తెలంగాణపైన ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదారాబాద్​లో ఆకాశం మేఘావృతమై సాయంత్రం వరకు నిర్విరామంగా మోస్తరు వర్షం కురవనున్నట్లు చెప్పింది. ఇవాళ్టి నుంచి 24 తేదీల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఎల్లో హెచ్చరికలు జారీ : కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్​నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఈ జిల్లాలకు యెల్లో హెచ్చరికలను జారీ చేసింది. గంటకు 30 నుంచి 40కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

జీహెచ్​ఎంసీ అప్రమత్తం : రాష్ట్రానికి భారీ వర్షాలంటూ ఐఎండీ హెచ్చరిక నేపథ్యంలో జీహెచ్​ఎంసీ అప్రమత్తమైంది. వర్షాల దృష్ట్యా జోనల్ కమిషనర్లతో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ టెలికాన్ఫరెన్స్​ నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలని, వాటర్​ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు నిలిస్తే వెంటనే క్లియర్ చేయాలని సూచించారు.

మెదక్​ జిల్లాలో భారీవర్షాలు :మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. గడిచిన 24 గంటలలో జిల్లాలోని చేగుంటలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం తిప్పారం గ్రామంలో గల ఊరు చెరువు కట్టకు గండి పడింది. చెరువు సామర్థ్యానికి మించి నీరు చెరువులోకి రావడం, కట్ట బలహీనంగా ఉండడంతో గండి పడి నాట్లు వేసిన పొలాల్లోకి నీరు చేరాయి. మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులోని ఇక్రిశాట్​లో వర్షంతో పాటు ఆకాశం నుంచి చేపలు పడినట్లు స్థానికులు చెబుతున్నారు. అటుగా వెళుతున్న స్థానికులకు చేపలు భూమిపై పాకుతూ కనిపించాయి. వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అధిక కాస్త వైరల్​గా మారింది.

భారీ వర్షాలకు పుట్టుకొచ్చిన కొత్త జలపాతం - ఎక్కడ అంటే ? - New WaterFalls in Nagarkurnool

హైదరాబాద్​లో వర్ష బీభత్సం - చెరువులను తలపించిన రహదారులు - Heavy Rains in Hyderabad

ABOUT THE AUTHOR

...view details