ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు రోజులు భారీ వర్షాలు - మూడో ప్రమాద హెచ్చరిక జారీ - HEAVY RAIN IN AP

రాబోయే మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ

imd_forecasts_heavy_rain_in_parts_of_coastal_ap_today
imd_forecasts_heavy_rain_in_parts_of_coastal_ap_today (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 25, 2024, 9:25 AM IST

IMD Forecasts Heavy Rain in Parts of Coastal AP Today :నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర భారతం మీదుగా వెళ్తున్న పశ్చిమద్రోణి అల్పపీడనాన్ని, తేమను తనవైపు లాగడానికి ప్రయత్నిస్తోంది. తీవ్ర అల్పపీడనం పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ నేటికి (బుధవారం) క్రమంగా బలహీనపడుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

దానికి అనుబంధంగా 4.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. బుధవారం ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది. పిడుగులు పడే అవకాశముందని వెల్లడించింది. బుధవారం మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది.

రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. శనివారం తర్వాత రాష్ట్రంలో వర్షాలు తగ్గుతాయి. మంగళవారం అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ఏలూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం తదితర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. చలిగాలులు వీచాయి. అల్పపీడనం తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉండడంతో తీరప్రాంత జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కళింగపట్నం, విశాఖపట్నం, తుని, కాకినాడ, మచిలీపట్నం, నందిగామ, గన్నవరం, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 7 డిగ్రీల మేర తగ్గాయి.

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం - కోస్తా జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు

రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం పలు జిల్లాల్లో ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే ఐదు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం వద్ద, పశ్చిమ మధ్య అల్పపీడన ప్రభావం కొనసాగుతోందని వివరించింది.

రెయిన్ అలర్ట్ : రాష్ట్రానికి వాయు'గండం' - ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

ABOUT THE AUTHOR

...view details