AP Rain Alert :బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇవాళ తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బుధవారం నాటికి తమిళనాడు, శ్రీలంక తీరాలకు చేరువవుతుందని భావిస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో బుధ, గురువారాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది. విపత్తుల నిర్వహణ సంస్థ మాత్రం ఈ నెల 15 వరకు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.
వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచనలు చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటను వర్షాలకు ముందు కోయరాదని చెప్పారు. ఇప్పటికే కోసిన పంట ఆరకపోతే ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్ప వేసుకోవడం వల్ల నష్టశాతాన్ని నివారించవచ్చని తెలిపారు. ఇతర సందేహాల నివృత్తికి మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
Heavy rains in AP :రాష్ట్రానికి వర్ష సూచనతో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం పలు సూచనలు చేసింది. జిల్లాల్లో కోసిన ధాన్యాన్ని తక్షణం రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశాలిచ్చింది. కళ్లాల్లో ఉన్న ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వర్షాల్లో వరికోతలు లేకుండా రైతులను అప్రమత్తం చేయాలని సూచించింది. ధాన్యం కుప్పలు వేయలేని చోట్ల రైతులకు టార్పలిన్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.