Heavy Rain Alert to Telangana : వానల సుడిగుండంలో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. పశ్చిమ మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి అనుబంధ ఆవర్తనం సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
ఇవాళ కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు. శుక్రవారం నాడు ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు.
Telangana Weather Report :పశ్చిమ - మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గత అల్పపీడనంతో పోలీస్తే దీని ప్రభావం కాస్త తక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. రాష్ట్రంలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.