Illegal Sand Mining Stopped by TDP Bode Prasad: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో జరిగే ఇసుక అక్రమ తవ్వకాలను మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అడ్డుకున్నారు. ఇసుక లారీలను అడ్డగించి క్వారీలోనే బైఠాయించారు. మంత్రి జోగి రమేష్‌ను వైసీపీ పెనమలూరు ఇన్‌ఛార్జ్‌గా నియమించగానే అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని బోడె ప్రసాద్ ఆరోపించారు.
క్వారీలో వ్యక్తులను ప్రశ్నిస్తే మంత్రి వాహనాలు అని తేలిందని అన్నారు. పెడనలో మంత్రిగా ఉండి పెనమలూరు నియోజకవర్గానికి ఇన్‌ఛార్జి వచ్చి, అడ్డగోలుగా దోచుకుంటున్నాడంటే, రేపు నియోజకవర్గాన్ని అమ్మకానికి పెడతారని బోడె ప్రసాద్ మండిపడ్డారు. చోడవరం, మద్దూరు గ్రామాలలో గత నాలుగు రోజుల నుంచి అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతోందని ధ్వజమెత్తారు.
అనుమతులు లేకుండా ఇసుక మాఫియా పొక్లెయిన్లు పెట్టి ఇసుక తరలిస్తున్నారన్నారని అన్నారు. అర్ధరాత్రి చోడవరం ఇసుక ర్యాంపు వద్దకు బోడె ప్రసాద్, తెలుగుదేశం శ్రేణులు వెళ్లారు. తెలుగుదేశం శ్రేణుల్ని చూసి పొక్లెయిన్లు, లారీలు వదిలేసి ఇసుక మాఫియా పరారయ్యారు. ఈమేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులకు బోడె ప్రసాద్ సమాచారం ఇచ్చారు. అక్రమ మైనింగ్ ఎవరు చేస్తున్నారో తేల్చాలంటూ ఇసుక రాంపులోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు కళ్లుండీ చూడలేకపోతున్నారని బోడెప్రసాద్ మండిపడ్డారు.
జోగి రమేష్‌ని పెనమలూరు ఇన్‌ఛార్జ్‌గా పెట్టి పది రోజులు కూడా అవ్వలేదని, అప్పుడే ఇష్టానుసారం అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. వేలాది లారీల్లో మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. తాను క్వారీలోకి రాగానే లారీ డ్రైవర్లు, ప్లొక్లెయిన ఆపరేటర్లు పారిపోయారని తెలిపారు. ఇక్కడ ఏ తప్పూ చేయకపోతే వారు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. జోగి రమేష్ గుమస్తా ఫిరోజ్ అనే వ్యక్తి అక్రమంగా మైనింగ్ జరుపుతున్నారని అన్నారు. నాలుగైదు రోజుల్లోనే పెనమలూరులో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.