ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేరుకే అది గుడారం - లోనే ఉంది అసలైన యవ్వారం! - Unsocial Activities in Gandikota - UNSOCIAL ACTIVITIES IN GANDIKOTA

Unsocial Activities in Gandikota : అసాంఘిక కార్యకలాపాలకు గండికోట అడ్డాగా మారింది. పోలీసుల నిఘా కొరవడడంతో అక్కడ రిసార్టులు, ప్రైవేట్ హోటళ్లు యజమానులు రెచ్చిపోతున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు పోటీ పడుతున్నారు. వారికి మందు, విందుతో పాటు కావాల్సిన సౌకర్యాలను అందిస్తున్నారు. దీంతో వారు రాత్రంతా అక్కడే ఉంటూ రచ్చచేస్తున్నారు.

Unsocial Activities in Gandikota
Unsocial Activities in Gandikota (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 12:04 PM IST

Gandikota Antisocial Events : చుట్టూ కొండలు కనుచూపు మేర పెన్నానది జల సోయగాలు ప్రముఖ పర్యాటక కేంద్రంగా అందరినీ ఆకట్టుకుంటున్న గండికోటపై కన్పించే దృశ్యాలివి. కానీ ఇక్కడ కంటికి కన్పించని అసాంఘిక కార్యకలాపాలెన్నో. చీకటి పడితే చాలు ఇక్కడ గుడారాలు వెలుస్తున్నాయి. గతంలో వైఎస్సార్సీపీ నాయకుల కనుసన్నల్లో ఈ యవ్వారం అంతా సాగింది. ఇప్పుడు మాత్రం ఇరుపార్టీల వారు సై అంటే సై అంటూ టెంట్లు వేసేస్తున్నారు. పైసలుంటే చాలు అందులోకే కావాల్సిన మద్యం, ఇతర సరకు చేరవేస్తున్నారు. ఎవరు వస్తున్నారో? ఎవరు పోతున్నారో? ఎలాంటి నిఘా లేదు. తాగి తందనాలాడడంతో పాటు వ్యభిచారం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు గండికోట నిలయంగా మారుతోంది.

అద్దె గదుల్లో జూదాల జోరు :గండికోటకు సందర్శకుల తాకిడి ఎక్కువైంది. రాష్ట్రంతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి వందలాది మంది వస్తున్నారు. శని, ఆదివారమైతే వారి సంఖ్య రెట్టింపవుతోంది. ప్రశాంతమైన వాతావరణం ఉండటంతో అనేక మంది రాత్రి సమయంలో కూడా ఇక్కడే గడపడానికి ఇష్టపడుతున్నారు. దీంతో జూదరులు రెచ్చిపోతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఆడుతున్నారు. ఖాళీ ప్రదేశాలు, అద్దె గదులు తీసుకుని దర్జాగా మత్తులో మునిగి తేలుతూ జూదకేంద్రంగా మారుస్తున్నారు. స్థానిక ప్రైవేట్‌ రెస్టారెంట్ల నిర్వాహకులు దీనిని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రతివారం రూ.లక్షలు చేతులు మారుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ గదులను యువత ఇతర కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు.

Unsocial Activities Gandikota Fort : మరోవైపు గండికోటలో నిఘా వ్యవస్థ నిద్రపోతోంది. ప్రధాన ప్రాంతాల్లో, రహదారులపై సీసీ కెమెరాలు మచ్చుకైనా కనిపించడం లేదు. విలాసాలకు గండికోటకు విచ్చేస్తున్న యువత మద్యం మత్తులో మైమరిచి వీరంగం సృష్టిస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ప్రభుత్వ పక్కా ఇళ్లలో రిసార్టులు, ప్రైవేట్ హోటళ్లు, గుడారాల ఏర్పాటుతో గండికోట సందర్శనకు వచ్చే పర్యాటకులకు భద్రత గాలిలో దీపంగా మారింది. కట్టడి చేయాల్సిన పోలీసు శాఖ కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప అరికట్టలేకపోతున్నారు.

పెన్నాలోయ వద్ద ఏర్పాటు చేసిన గుడారాలు (ETV Bharat)

నిబంధనలు పాటించే వారేరీ?

  • పర్యాటక ప్రాంతాల్లో లాడ్జిల్లో ఉండాలంటే వారి ఆధార్‌ కార్డు, మొబైల్‌ నంబర్లు, చిరునామా తదితర వివరాలు తప్పనిసరిగా తీసుకుంటారు. కానీ ఇక్కడ డబ్బులు ఇస్తే చాలు వారెవరన్నది అవసరం లేదు. కావాల్సినవన్నీ దొరుకుతాయి. అక్రమాలకు తలుపులు బార్లా తెరిచే ఉంటారు. దీంతో విద్యార్థులు, యువత చెడు వ్యసనాల బారిన పడుతున్నారు.
  • శని, ఆదివారాల్లో గండికోట ఊరిబయట ఖాళీ ప్రదేశంలో అనధికారికంగా గుడారాలు ఏర్పాటు చేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాదీలు ఎక్కువగా ఉంటున్నారు. వీరు అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాత్రంతా అక్కడే ఉంటూ రచ్చచేస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక ఓ నాయకుడి ఆధ్వర్యంలో గుడారాలు వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
  • గతంలో ఇక్కడ అనేక అల్లర్లు, గొడవలు, దొంగతనాలు సైతం జరిగాయి. ఇది పోలీసులకు సైతం తలనొప్పిగా మారింది. జిల్లాస్థాయి అధికారులు, కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లడంతో గతంలో కొన్ని నెలల పాటు వాటిని నిలిపేశారు. మళ్లీ గుడారాలు వేయడం మొదలు పెట్టారు.

పోలీసులెక్కడ? :గండికోటలో నిత్యం అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పోలీసులు మాత్రం తమకేమీ పట్టదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఇది కాస్తా విమర్శలకు దారితీస్తోంది. ఏదో ఒక గొడవ జరిగినప్పుడు మాత్రమే వారు స్పందిస్తున్నారు. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. అనధికారికంగా గుడారాలు వేస్తున్నా పోలీసులు ప్రశ్నించడం లేదు. ప్రైవేట్ హోటళ్లు, రెస్టారెంట్లపై ఏమాత్రం నిఘా ఉంచడం లేదు.

తాళాలు వేసిన పోలీస్ ఔట్​పోస్ట్ (ETV Bharat)

దీంతో ఇక తమకు అడ్డు లేదని స్థానికుల సాయంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గతంలో పోలీసుశాఖ అధికారులు పర్యాటకుల రక్షణ కోసం గండికోట వెలుపల ఏర్పాటు చేసిన పోలీస్‌ ఔట్​ పోస్ట్‌కు తాళాలు వేయగా చుట్టూ పిచ్చి మొక్కలతో నిరుపయోగంగా ఉంది. గండికోటకు వచ్చే పర్యాటకులకు భద్రత చర్యలతో పాటు మెరుగైన వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

భద్రతపై దృష్టి సారిస్తాం : గండికోటకు కర్ణాటక, తమిళనాడు, ముంబయి తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారని జమ్మలమడుగు అర్బన్ సీఐ లింగప్ప తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచామని చెప్పారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాీరు. ప్రైవేటు హోటళ్లు, గుడారాల యజమానులు భద్రతా ప్రమాణాలు పాటించాలని సీఐ సూచించారు.

స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు - పోలీసుల అదుపులో 22మంది

రాయలవారికోటలో అసాంఘిక కార్యకలాపాలు..

ABOUT THE AUTHOR

...view details