Illeagal Soil Mining in Satyasai District: మట్టివ్యాపారులు అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు. వందల ఎకరాల్లో విస్తరించిన కొండను యంత్రాలతో తవ్వేస్తూ పిండి చేసేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమంగా తరలిస్తూ, సొమ్ము చేసుకుంటున్నారు. ఇంతా జరుగుతున్న అధికారులేవరూ అటువైపూ కన్నెత్తైనా చూడటం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూగజీవాలకు గ్రాసానికి ఆధారమైన కొండను తవ్వొద్దని గ్రామస్థులు అడ్డుకునేందుకు యత్నించినా, అనుమతులు ఉన్నాయని అబద్దాలతో ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు.
శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం చౌటతండా సమీపంలోని వందల ఎకరాల్లో కొండలు విస్తరించి ఉన్నాయి. వీటిపై మట్టి వ్యాపారులు కన్నేశారు. గత నెల రోజులుగా యంత్రాల సహాయంతో కొండను తవ్వి మట్టిని తరలిస్తున్నారు. మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తూ, కొండ నామారూపాలు లేకుండా చేస్తున్నారు.
వైసీపీ నేతల మట్టి దోపిడీపై అధికారుల ఉదాసీనత! విప్ అండదండలతోనే తవ్వకాలన్న టీడీపీ నేత కాలవ
భూగర్భ జలాలు పెంచాలనే ఉద్దేశంతో ఈ కొండ పరిధిలో 25 ఎకరాల విస్తీర్ణంలో వాటర్ షెడ్లు నిర్మించారు. లక్షలాది రూపాయల వ్యయంతో 2017లో చెక్ డ్యామ్‌లను సైతం నిర్మించారు. 14 లక్షల రూపాయల వ్యయంతో పలు రకాల మొక్కలను నాటారు. ఇదే విషయాన్ని స్థానికులు మట్టి వ్యాపారులకు వివరించినా ప్రయోజనం లేకుండా పోయింది. టిప్పర్లతో మట్టిని తరలిస్తూ కొండను కొల్లగొట్టేస్తున్నారు.
తమ జీవనాధారమైన గొర్రెలు, మేకలు మేపడానికి ఆధారమైన కొండను నాశనం చేయద్దంటూ, రెండు రోజులుగా తండా వాసులు అడ్డుకున్నా మట్టి తవ్వకాలు ఆగలేదు. మూగజీవాలను మేపడానికి ఎక్కడికి వెళ్లాలని పశువువ కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మట్టిన తరలించడాన్ని అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.