IIT Expert Team Review on Amaravati Situation :రాజధాని అమరావతిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం వల్ల ఇప్పుడు కొత్తగా చేపట్టాల్సిన నిర్మాణాల మాట అటుంచి, నిలిచిపోయిన వాటిని ముందుకు తీసుకెళ్లేందుకే భారీ కసరత్తు చేయాల్సి వస్తోంది. దానికి ఖర్చూ తడిసి మోపెడవుతోంది. గత ఐదేళ్లుగా చెరువుల్ని తలపిస్తున్న సచివాలయం, విభాగ అధిపతుల కార్యాలయ భవనాల టవర్లు, హైకోర్టు పునాదుల నుంచి నీటిని తోడేందుకే కోటి రూపాయలకు పైగా ఖర్చవుతుందని అంచనా!
ఐఐటీ నిపుణుల బృందం పర్యటన :అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాల నాణ్యతను, ఇతర సాంకేతిక అంశాలను పరిశీలించే బాధ్యతను హైదరాబాద్, మద్రాస్ ఐఐటీల నిపుణులకు సీఆర్‌డీఏ (CRDA) అప్పగించింది. హైదరాబాద్ ఐఐటీ బృందం ఆగస్టు 2న రాజధాని ప్రాంతంలో పర్యటిస్తోంది. మరో వారం పది రోజుల్లో మద్రాస్ ఐఐటీ బృందం కూడా అమరావతికి రానున్నట్టు సమాచారం.
అమరావతిలో మరో రెండు రాచబాటలు - సీఆర్‌డీఏ తాజా ప్రతిపాదన - Amaravathi National Highways
ఐకానిక్ భవనాలుగా తలపెట్టిన సచివాలయం, హెచ్‌ఓడీ టవర్లు, హైకోర్టు పునాదుల పరిశీలన బాధ్యతను మద్రాస్ ఐఐటీకి అప్పగించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారుల నివాస భవనాల టవర్ల నిర్మాణాల నాణ్యత పరిశీలన బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి కట్టబెట్టారు. ఇన్నాళ్లూ పట్టించుకోకుండా వదిలేసిన భవనాల పటిష్ఠత ఎలా ఉంది? ఐదేళ్లుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్న ఇనుప ఊచలు తుప్పుపట్టాయా? నిర్మాణాల్ని కొనసాగించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల్ని హైదరాబాద్ ఐఐటీ నిపుణులు బృందం (IIT HYD Expert Team) పరిశీలిస్తారు. ఆయా భవన నిర్మాణాల కోసం తీసుకొచ్చిన, ఐదేళ్లుగా స్టాక్‌యార్డుల్లో మూలుగుతున్న నిర్మాణ సామగ్రి పనికొస్తుందా లేదా అన్నదీ ఐఐటీ నిపుణులు ధ్రువీకరించనుంది.
పునాదులు పరిశీలించాలన్నా నీళ్లు తోడాల్సిందే :మద్రాస్ ఐఐటీకి చెందిన కాంక్రీట్ రంగ నిపుణులు మనుసంతానం, సివిల్ ఇంజినీరింగ్ విభాగ అధిపతి మెహర్ ప్రసాద్, ఇనుముకు తుప్పు (కొరోజన్) నిపుణుడు పిళ్లైలతో కూడిన బృందం గతంలో రాజధానిలో సచివాలయం, హెచ్‌ఓడీ టవర్లు, హైకోర్టు భవనం పునాదులు వేసినప్పుడు సాంకేతిక సహకారం అందించింది. ఐదేళ్లుగా నీళ్లలోనే ఉన్న ఆ పునాదులు, ఉక్కు నాణ్యతను పరిశీలించి అవసరమైన సూచనలు చేసే బాధ్యతను ఇప్పుడు వారికే సీఆర్‌డీఏ (Capital Region Development Authority) అప్పగించింది.