Hydera Operations in Hyderabad : రాష్ట్రంలో సంచలనంగా మారిన చెరువుల బఫర్ జోన్‌లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇప్పటి వరకు ఏకంగా 18 ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్లు నివేదికలో పేర్కొంది. కూల్చివేత ద్వారా 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా స్పష్టం చేసింది.
ఎవరెవరివి ఉన్నాయంటే :ఇందులో ఎన్ కన్వెన్షన్‌తో పాటు కావేరి సీడ్స్ యజమాని భాస్కరరావుకు చెందిన నిర్మాణం, అలాగే ప్రొ కబడ్డీ యజమాని అనుపమకు చెందిన భవనం, మంథని బీజేపీ నేత సునీల్ రెడ్డికి చెందిన నిర్మాణం, బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ నిర్మాణం, ఎంఐఎం ఎమ్మెల్సీ మహ్మద్ మీర్జా భవనం, నందగిరి హిల్స్‌లో ఎమ్మెల్యే దానం మద్దతుదారుడి నిర్మాణం, చింతల్ బీఆర్‌ఎస్ నేత రత్నాకరం సాయిరాజు షెడ్డు కూల్చినట్లు నివేదిక సమర్పించింది.
మరోవైపు శనివారం ఉదయం సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చిన విషయం తెలిసిందే. తుమ్మిడికుంట చెరువులో అనధికారిక నిర్మాణం చేయడం వల్లే సినీ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ కూల్చివేసినట్లు హైడ్రా స్పష్టం చేసింది. ఎన్ కన్వెన్షన్‌కు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి భవన నిర్మాణ అనుమతులు లేవని, ఏ న్యాయస్థానం కూడా స్టేలు ఇవ్వలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.