HYDRA for Resurvey FTL and Buffer Zones : వందలో ఇద్దరు నష్టపోయినా, 98 మందికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మారుస్తోంది. ఆక్రమణదారుల అంచనాలను తలకిందులు చేస్తూ వారాంతాల్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్న కన్వెన్షన్ సెంటర్లు, షెడ్లతో పాటు చిన్న చిన్న గుడిసెలు, భారీ భవనాల వరకు గంటల వ్యవధిలో కూల్చివేస్తోంది. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట కూల్చివేతల విషయంలో హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో కొత్తగా నిర్మించే నివాసాలు, నిర్మాణాలను మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని, ఇప్పటికే శాశ్వతంగా ఉంటున్న నివాసాల జోలికి హైడ్రా వెళ్లబోదని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా హైడ్రా వ్యూహంలోనూ పంథా మార్చబోతున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల వివాదం ముదురుతున్న క్రమంలో ఇప్పటి వరకు గుర్తించిన ఆక్రమణలకు సంబంధించి రీ సర్వే చేశాకే, కూల్చివేతలు చేపట్టాలనే దిశగా హైడ్రా పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులో కూల్చివేతలను చేపట్టిన హైడ్రా, మొత్తం 28 అనధికారికంగా నిర్మించిన విల్లాల్లో 14 విల్లాలను నేలమట్టం చేసింది. మరో 18 విల్లాల్లో కుటుంబాలు నివసిస్తుండగా వాటిని కూల్చివేతల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ విషయంపై అనేక అనుమానాలు ఉన్న బాధితులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిశారు. బుద్దభవన్‌లోని ప్రధాన కార్యాలయంలో 15 మందితో సమావేశమైన రంగనాథ్ బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.