Hydra Deployed Lake Protection Teams in Hyderabad : రాష్ట్ర రాజధానిలో ఇక నుంచి చెరువులను ఇష్టానుసారంగా ఆక్రమించకుండా, వ్యర్థాలతో నింపకుండా హైడ్రా కఠిన చర్యలకు సిద్ధమైంది. చెరువుల రక్షణ కోసం 'లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్'ను ఏర్పాటు చేసింది. ఒక్కో చెరువునకు ఇద్దరు సిబ్బంది చొప్పున రోజంతా వాటిపై నిఘా వేసి ఉంచనున్నారు. కంటికి రెప్పలా వాటిని కాపాడటమే లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ బాధ్యత. నీలం రంగు డ్రెస్ కోడ్‌తో ఉండే సిబ్బంది చెరువుల వద్ద ఆక్రమణలు జరిగినా, నిర్మాణాలకు ప్రయత్నించినా, నిర్మాణ వ్యర్థాలతో పూడ్చేందుకు యత్నించినా వెంటనే హైడ్రాకు సమాచారాన్ని ఇవ్వనున్నారు. వారిచ్చే సమాచారం ఆధారంగా ఆక్రమణలకు పాల్పడే వారిని అప్పటికప్పుడు అరెస్టు చేయడానికి కూడా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు.
బల్దియా పరిధిలో 185 చెరువులుండగా హెచ్ఎండీఏ పరిధిలో 3500 చెరువులున్నాయి. మూడొంతుల చెరువులకు ఇప్పటికీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల హద్దులను నిర్ధారించలేదు. తుది నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో హద్దులు సరిగా లేకపోవడంతో అనేక మంది అనుమతులు లేకుండానే ఎఫ్టీఎల్ పరిధిలో భారీ భవనాలు నిర్మించుకున్నారు. కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధుల అండతో చెరువుల గర్భంలోనే నిర్మాణాలు చేపట్టి వ్యాపారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెరువుల పరిరక్షణపై దృష్టి పెట్టిన హైడ్రా, వాటిని కూల్చివేయడమే కాకుండా చెరువును పూర్తిగా పరిరక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటి వరకు జరిగిన ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఇకపై చెరువులను ఎవరూ కబ్జా చేయకుండా ఉండేందుకు ప్రత్యేకంగా లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. హైడ్రా ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, చెరువుల వద్ద నిరంతరం నిఘా ఉండేలా సిబ్బందిని నియమించుకునేందుకు హైడ్రాకు అనుమతులు ఇచ్చింది.