Hydra To Receive Public Complaints :చెరువుల పరిరక్షణ, పునరుద్దరణతోపాటు ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు హైదరాబాద్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ప్రతి సోమవారం ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించబోతుంది. ప్రభుత్వ సెలవులు మినహాయించి ప్రతి సోమవారం ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కులు ఇలా ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాల పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రంగనాథ్ వివరించారు.
ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరణ :ప్రజల నుంచి ఫిర్యాదులతో పాటు సలహాలు కూడా స్వీకరిస్తామని తెలిపిన రంగనాథ్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరిగి 3 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు బుద్దభవన్ లోని హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదులు తీసుకోనున్నట్లు తెలిపారు. ఫిర్యాదుకు సంబంధించిన అన్ని ఆధారాలు, పూర్తి వివరాలతో రావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. నగర ప్రజలకు ఏమైనా సందేహాలుంటే 040 - 29565758, 29560596 నంబర్లలో సంప్రదించాలని రంగనాథ్ కోరారు.
అయ్యప్ప సొసైటీలో రంగనాథ్ పర్యటన :హైదరాబాద్ మాదాపూర్‌లోని అయ్యప్పసొసైటీలో అక్రమ నిర్మాణంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కన్నెర్ర జేశారు. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా అయ్యప్పసొసైటీలోని వంద ఫీట్ల రోడ్డును ఆనుకొని 684 గజాల స్థలంలో సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 5 అంతస్తుల భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారంటూ హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసులతోపాటు హైకోర్టు ఉత్తర్వులను పరిశీలించారు. అక్రమ కట్టడమని హైకోర్టు నిర్ధారించాక కూడా కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా భవనాన్ని నిర్మించడాన్ని హైడ్రా కమిషనర్ తీవ్రంగా పరిగణించారు. పూర్తి వివరాలను పరిశీలించాక ఆ భవనంపై చర్యలు తీసుకుంటామని రంగనాథ్ స్పష్టం చేశారు