Hydra Commissioner Ranganath Clarifies on Demolition :హైదరాబాద్ మహానగరంలో చెరువుల పునరుద్ధరణకు సంబంధించి హైడ్రా మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా అంబర్‌పేట బతుకమ్మకుంటకు పూర్వవైభవం తీసుకొచ్చే చర్యలు మొదలుపెట్టింది. ఆక్రమణల జోలికి వెళ్లకుండా మిగిలిన చెరువులో మిగిలిన స్థలాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే బతుకమ్మ కుంటను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు.
బతుకమ్మకుంట పునరుద్ధరణపై స్థానికులతో రంగనాథ్ మాట్లాడారు. నిర్మాణ వ్యర్థాలు పోసి ఆక్రమించడంతో 16 ఎకరాలు ఉన్న దీని విస్తీర్ణం 5.15 ఎకరాలకు కుచించుకుపోయిందని తెలిపారు. స్థానికుల విజ్ఞప్తితో పునరుద్ధరణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. తమ ఇళ్లు కూల్చేస్తారా అంటూ అక్కడి వారు కమిషనర్‌ను ప్రశ్నించారు. దీనిపై స్పందించి ఆయన ఇళ్లు, నివాస స్థలాల జోలికి వెళ్లబోమని స్పష్టం చేశారు. బతుకమ్మకుంటలో కూల్చివేతలు ఉండవని రంగనాథ్ చెప్పారు.
HYDRA on Bathukamma Kunta : కూల్చివేతల చేపడతామనే అపోహ స్థానికుల్లో ఉందని రంగనాథ్ చెప్పారు. దాన్ని తొలగించేందుకే ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న విస్తీర్ణంలోనే పునరుద్ధరణ చేస్తామన్నారు. చెరువులోకి వరద నీరు వచ్చే మార్గాలపై అధికారులతో చర్చిస్తామని తెలిపారు. హైడ్రాకు నోటీసులు ఇచ్చే అధికారం ఉందని వివరించారు. ఆక్రమణదారులకు హైడ్రా నోటీసులు వెళ్తూనే ఉంటాయని రంగనాథ్ వ్యాఖ్యానించారు. మరోవైపు హైడ్రా కమిషనర్ రాకతో బతుకమ్మకుంట పరిసరాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.