Godavari Banakacherla inter Linking Project : రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలు ఎక్కించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు రూ.70-80 వేల కోట్ల అంచనా వ్యయంతో దీన్ని చేపడతారు. మూడు నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఈ ప్రాజెక్టుపై జలవనరులశాఖ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరిపారు. వ్యాప్కోస్ రూపొందించిన ఆరు ప్రత్యామ్నాయాలపై ఇందులో చర్చ జరిగింది. కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు సాయం అందేలా ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం లభించినట్లు సమాచారం. చంద్రబాబు తాజా దిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తదితరులతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ఎంత కీలకమో, ఈ ప్రాజెక్టూ అంతే ముఖ్యం.
పోలవరంతో వంశధార వరకు అనుసంధానం ప్రణాళిక ఒకటి.. ఇటు రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం కల్పించే ఈ అనుసంధానం మరో కీలకం. ఈ రెండూ పూర్తయితే రాష్ట్రానికి జలహారతి వేసినట్లే. కరవు పారదోలినట్లే అని ప్రభుత్వం నిశ్చితాభిప్రాయంతో ఉంది. ఎగువ ప్రాజెక్టుల కారణంగా కృష్ణాలో నీళ్లు సరిగా రావట్లేదు. మరోవైపు గోదావరిలో సగటున ఏటా 2వేల టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇందులో 280 టీఎంసీలను వరద సమయంలో మళ్లించాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. వరద రోజుల్లోనే నీళ్లు మళ్లిస్తారు కాబట్టి గోదావరి డెల్టాకు ఇబ్బంది ఉండదు. కృష్ణాడెల్టాకు ఎటూ 80 టీఎంసీలు ఇస్తారు. వరద రోజుల్లో రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు 280 టీఎంసీల గోదావరి వరద జలాలు ఇవ్వనున్నారు.
త్వరలో కేంద్రానికి లేఖ
తాజాగా దిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ భారీ ప్రాజెక్టుపై కేంద్ర పెద్దలతో మాట్లాడారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించారు. దేశానికి ఈ ప్రాజెక్టు ఎలా ఉపయుక్తమో వివరించారు. భారీ ప్రాజెక్టు కావడంతో కేంద్రసాయం లేకుండా చేపట్టడం సాధ్యం కాదు. అందువల్ల కేంద్ర పెద్దలకు వివరించి, ఆదివారమైనా చంద్రబాబు దీనిపై అధికారులతో సమావేశమయ్యారు. త్వరలో ఈ ప్రాజెక్టుకు ఆర్థికసాయం కోరుతూ కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ లేఖ రాయనుంది. అన్ని అనుమతులూ పొంది త్వరగా టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో చేపట్టనున్నారు.
తొలుత పోలవరం నుంచి కృష్ణానదికి గోదావరి వరద జలాల మళ్లింపు, తర్వాత దశలో బొల్లాపల్లి జలాశయం నిర్మించి అక్కడికి నీళ్లు తరలించి అందులో నింపి, తదుపరి దశలో బొల్లాపల్లి నుంచి బనకచర్ల రెగ్యులేటర్‌కు నీళ్లు మళ్లిస్తారు. దీనిద్వారా గరిష్ఠంగా 345 టీఎంసీలు వినియోగించుకునే ఆస్కారం ఉందని అంచనా. ఆంధ్రప్రదేశ్‌కు జలహారతి పేరుతో ఈ బృహత్తర పథకాన్ని చేపట్టాలని ప్రాథమికంగా యోచిస్తున్నారు. రాయలసీమ జిల్లాలలో పాటు కరవు ప్రాంతాలుగా ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు దీనివల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ సమావేశంలో జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయం 5డి ప్రకారం..
- పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచుతారు. తాడిపూడి కాలువ సామర్థ్యాన్ని 5,000 క్యూసెక్కులకు పెంచుతారు. ఆ నీటిని కృష్ణానది వద్ద వైకుంఠపురం వరకు తీసుకెళ్తారు. అక్కడ బ్యారేజి నిర్మించి ఆ నది వద్ద ఈ వరద జలాలు కలుపుతారు.
- తిరిగి అక్కడి నుంచి సాగర్ కుడికాలువ వెడల్పు చేయడంతో పాటు మరికొంత కొత్త కాలువతో బొల్లాపల్లి జలాశయానికి తీసుకెళ్తారు. 150 టీఎంసీల నిల్వ చేసేలా బొల్లాపల్లి జలాశయం నిర్మిస్తారు. అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు తరలిస్తారు.
- ఇందులో రెండుచోట్ల టన్నెళ్లు, 9చోట్ల పంపుహౌస్‌లు అవసరం. గ్రావిటీ కాలువ అవసరమైనచోట తవ్వాలి.
6 ప్రత్యామ్నాయాలు
వ్యాప్కోస్ అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలోనే ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేసింది. కొన్ని ప్రత్యామ్నాయాలు సూచించింది. లైడార్ సర్వే కూడా పూర్తయింది. తాజాగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మళ్లీ కొంత అధ్యయనం చేసి మొత్తం ఆరు ప్రత్యామ్నాయాలు ఇందులో పేర్కొంది. ఆ ప్రత్యామ్నాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. అందులో రెండు ప్రత్యామ్నాయాలు డిజైన్లకు అనువుగా ఉన్నాయని వ్యాప్కోస్ జలవనరులశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో రెండు ప్రత్యామ్నాయాలు కృష్ణానదిలో నీళ్లు కలపకుండా, మరో నాలుగు ప్రత్యామ్నాయాలు ఆ నీటిని కృష్ణాలో కలిసి తీసుకెళ్లేలా చేసింది. ప్రధానంగా రెండు ప్రత్యామ్నాయాలు సాంకేతికంగా, అమలుచేసేందుకు వీలుగా ఉన్నాయని వ్యాప్కోస్ తన నివేదికలో అభిప్రాయపడింది.
పరిశీలనలో ఉన్న ప్రత్యామ్నాయం 2 ప్రకారం..
- పోలవరం జలాశయం నుంచి వరద జలాలు మళ్లిస్తారు. కొత్తగా 25వేల క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం కుడి కాలువకు సమాంతరంగా వరదకాలువ తవ్వుతారు.
- పోలవరం కుడికాలువతో పాటు ఈ కొత్త వరద కాలువను ఉపయోగించుకుని వరద జలాలు కృష్ణానదిపై వైకుంఠపురం వరకు మళ్లిస్తారు.
- కృష్ణానదిపై వైకుంఠపురం వద్ద అక్విడక్టు నిర్మించి నీటిని దాటిస్తారు. అక్కడి నుంచి సాగర్ కుడికాలువ ద్వారా మరికొంత కొత్త కాలువ తవ్వి బొల్లాపల్లి జలాశయానికి మళ్లిస్తారు. 200 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో బొల్లాపల్లి వద్ద జలాశయాన్ని నిర్మిస్తారు. బొల్లాపల్లి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు తరలిస్తారు. ఇందులో టన్నెళ్లు తవ్వాలి. నీటిని వివిధ దశల్లో ఎత్తిపోయాలి.
- నాలుగుచోట్ల టన్నెళ్లు 8 చోట్ల పంపుహౌస్‌లు అవసరం. మధ్యలో గ్రావిటీ కాలువ కూడా ఉంటుంది.
ప్రాజెక్టు ముఖ్యాంశాలు
- 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 22.5 లక్షల ఎకరాల స్థిరీకరణ, 80 లక్షల మందికి తాగునీటి సౌలభ్యం, పరిశ్రమలకు 20 టీఎంసీలు
- రోజుకు 2-3 టీఎంసీల గోదావరి వరద జలాల మళ్లింపు
- 54వేల ఎకరాల భూమి సేకరించాలి. కొంత అటవీభూమి ఉంది. 4వేల మెగావాట్ల విద్యుత్తు అవసరం.
2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల - సీఎం ఏమన్నారంటే!
ఆ మూడు విషయాల్లో 'జీరో' ప్రగతి - వైఎస్సార్సీపీ హయాంలో పోలవరం పురోగతిపై కేంద్రం