Anakapalli News Today: తండ్రీకొడుకుల మధ్య మాటామాటా పెరిగింది. అది పట్టరాని కోపంగా మారింది. కొడుకుపై ఆగ్రహంతో తండ్రి చెయ్యెత్తాడు. ఇంకేముంది మామూలుగా అయితే ఒకట్రెండు దెబ్బలు వేశాక ఆ తండ్రి శాంతించేవాడేమో కానీ మద్యం ఆ తండ్రి ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లయింది. తలకెక్కిన మత్తు విచక్షణ మరిచిపోయేలా చేసింది. కని పెంచిన కొడుకుపై ఉన్మాదంగా దాడి చేయడానికి కారణమైంది. అయితే మత్తు దిగాక, మెలకువ వచ్చాక తాను ఎంతటి ఘోరానికి ఒడిగట్టాడో ఆ తండ్రికి తెలిసొచ్చింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. కొడుకు నిండుప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
ఏలూరు జిల్లాలో దారుణం - ఆస్తి తగాదాలతో తల్లి, కుమారుడి దారుణ హత్య
క్షణికావేళానికి నిండు ప్రాణం బలి: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మద్యం మత్తులో కన్నకొడుకును తండ్రే హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. సీఐ గోవిందరావు కథనం ప్రకారం విశ్రాంత ఆర్మీ ఉద్యోగి కఠారి రమణ (70) పట్టణంలోని లక్ష్మీనగర్‌లో ఉన్న ఓ అపార్టుమెంటులో నివాసం ఉంటున్నారు. భార్య సత్యవతి కొన్నేళ్ల కిందట మరణించింది. వీరికి కుమారుడు భాస్కరరావు (32). కుమార్తె పావని ఉన్నారు. తండ్రీ, కొడుకు అపార్ట్‌మెంట్‌లో కలిసే ఉంటున్నారు. కుమార్తె ధర్మసాగరం సమీపంలో ఉంటోంది. ఆమె అప్పుడప్పుడు వచ్చి తండ్రి, తమ్ముడు యోగక్షేమాలు కనుక్కుని వెళ్తోంది. ఇంటి పనులు చేసేందుకు ఇంటికి పనిమనిషి వస్తోంది.
కాగా, శనివారం రాత్రి కుటుంబానికి సన్నిహితుడైన జిలానీతో కలిసి ఇంట్లో మద్యం తాగారు. డబ్బు దుబారా చేస్తున్నావంటూ తండ్రిని మందలించాడు. దాంతో తండ్రీ, కొడుకు ఒకరిపై ఒకరు కేకలు వేసుకున్నారు. మద్యం తాగడం పూర్తయ్యాక జిలానీ తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం కొనసాగింది. కోపం అదుపు తప్పిన తండ్రి రమణ కర్ర (చపాతీ కర్ర)తో కొడుకు తలపై బలంగా కొట్టాడు. దాంతో భాస్కర్ అక్కడికక్కడే కుప్పకూలాడు. తరువాత మద్యం మత్తులో ఉన్న తండ్రి రమణ తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు.
ఉదయానే నిద్ర లేచి బయటకు వచ్చి చూసిన రమణ రక్తపు మడుగులో పడి ఉన్న కొడుకును చూసి బోరున విలపించాడు. కొద్దిసేపటికే ఇంటికొచ్చిన పనిమనిషికి రాత్రి జరిగిందంతా చెప్పాడు. ఆమె ఇచ్చిన సమాచారంతో సీఐ గోవిందరావు, ఎస్సైలు ఉమామహేశ్వరరావు, రమేష్, క్లూస్‌టీం సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. నిందితుడు రమణను అదుపులోకి తీసుకున్నారు. భాస్కరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.
పార్శిల్‌లో మృతదేహం - ఆ కారులో వచ్చిన మహిళ ఎవరు?
సినిమా స్టైల్లో మర్డర్ - కుమార్తెను కిడ్నాప్ చేశాడనే అనుమానంతో హనీట్రాప్ హత్య