Hydra in Jubilee Hills : హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత తప్పదని మరోసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఆక్రమణదారులపై కేసుల నమోదుకు హైడ్రా పోలీస్ స్టేషన్‌కు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు రంగనాథ్ వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్, హుడాఎన్ క్లేవ్ కాలనీతో పాటు గురుబ్రహ్మనగర్ బస్తీల్లో తమ సిబ్బందితో కలిసి రెండు గంటలపాటు ఆయన పర్యటించారు.
పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలం : ఆక్రమణకు గురైన ఎకరా 25 గుంటల ప్రభుత్వ భూమిపై ఆరా తీశారు. 2011లో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కొంత మంది ఆక్రమిస్తున్నారని బస్తీవాసులు రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. బస్తీని ఆనుకొని ఉన్న పార్క్ స్థలాన్ని కొంతమంది ఆక్రమణదారులు కబ్జా చేస్తున్నారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు.
"ఇక్కడ ఉన్న ఎకరం 25 గుంటలను ముందుగా రక్షిస్తాం. అలాగే డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం కేటాయించిన స్థలంలో వారికి ఇళ్ల కట్టించే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా ఇక్కడ ముందుగా సర్వే చేసి ఆక్రమణలను గుర్తించి పార్కును కాపాడుతాం. ఇక్కడ ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. వాటిని పూర్తిగా పరిశీలించి పరిష్కార మార్గాలు చూపుతాం" -హైడ్రా కమిషనర్ రంగనాథ్