Commissioner Ranganath Clarity On Owaisi College :రాజకీయ చదరంగంలో హైడ్రా పావుగా మారదల్చుకోవడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. చెరువు ఎఫ్‌టీఎల్ ఆక్రమించి కళాశాలలు నిర్మించే యాజమాన్యాలపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అయితే అందులో చదివే విద్యార్థుల భవిష్యత్‌ను రోడ్డున పడేయకుండా ఆయా కళాశాలల యాజమాన్యానికి కొంత సమయం ఇస్తామని రంగనాథ్ తెలిపారు.
హైడ్రా కమిషనర్‌ను కలిసిన బీజేపీ కార్పోరేటర్లు :జీహెచ్ఎంసీలోని పలువురు బీజేపీ కార్పొరేటర్లు బుద్దభవన్లో ఉన్న హైడ్రా కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్‌ను కలిసి చెరువులు, పార్కుల ఆక్రమణలపై ఫిర్యాదు చేశారు. ఓవైసీ, మల్లారెడ్డి సహా పలు ఆక్రమణలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లతో మాట్లాడిన రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వదని కూల్చడమేనని అన్నారు. పార్టీలకు అతీతంగా హైడ్రా చర్యలుంటాయని కార్పొరేటర్లకు వివరించారు.
చెరువుల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు : హైదరాబాద్ మహానగరంలో చెరువుల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బుద్దభవన్‌లోని హైడ్రా కార్యాలయాలనికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు వరుస కడుతున్నారు. దీంతో హైడ్రా కార్యాలయానికి తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. మొదట పదుల సంఖ్యలో వచ్చిన ఫిర్యాదులు హైడ్రా కఠిన చర్యలతో వందల్లో పెరుగుతున్నాయి. వాటన్నింటిని స్వీకరిస్తున్న హైడ్రా కార్యాలయ సిబ్బంది అందులోని వివరాలను నమోదు చేసుకుంటూ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. మరోవైపు ఫిర్యాదుదారుల తాకిడి పెరగడంతో హైడ్రా కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు పెంచారు.