Hydra Focus On Lakes Data:హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు, అనధికారిక కట్టడాలపై ఉక్కుపాదం మోపుతూ సంచలనంగా మారిన హైడ్రా అయోమయంలో పడింది. నగరంలోని చెరువులు, కుంటల లెక్క తెలియక సందిగ్ధంలోకి వెళ్లింది. ఆ విషయాన్ని స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. తొలిదశలో కూల్చివేతలతో భయపెట్టిన హైడ్రా రెండో దశలో చెరువులను పునరుద్దరించడమే లక్ష్యంగా వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు రంగనాథ్ వెల్లడించారు.
చెరువులు, కుంటల లెక్కలు తీస్తున్న హైడ్రా : ఒకప్పుడు హైడ్రా పేరు వింటేనే ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఆక్రమణదారులు ఎంతటి వారైనా విడిచిపెట్టేది కాదు. అలాంటి హైడ్రా ఇప్పుడు పూర్తిగా పంథా మార్చింది. ఓఆర్ఆర్ వరకి విస్తరించి ఉన్న హైడ్రా పరిథిలో ఎన్ని చెరువులు ఉన్నాయో వాటిని ఎలా పునరుద్దరించాలనే విషయంపై దృష్టి పెట్టింది. నగరంలోని చెరువులు, కుంటల సంఖ్య పూర్తి స్థాయిలో నిర్ధారణ కాకపోవడంతో నేషనల్ రిమోట్ సెన్సింగ్ డేటాతోపాటు సర్వే ఆఫ్ ఇండియా, విలేజ్ మ్యాప్‌ల ఆధారంగా చెరువులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. చెరువులు, కుంటలు, నాళాల పునరుద్ధరణపై మేధావులు, నిపుణులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు సూచనలు స్వీకరిస్తున్నారు.
మ్యాప్‌ల ఆధారంగా చెరువుల గుర్తింపు :పెరిగిన పట్టణీకరణలో భాగంగా హైదరాబాద్‌లో భూములధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జాలకి గురవుతున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. హైదరాబాద్‌లో ఇప్పటివరకి 61 శాతం చెరువులు కనుమరుగై ఆప్రాంతమంతా కాంక్రీట్‌జంగిల్‌గా మారిందన్నారు. మిగిలిన 39 శాతం చెరువులు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఇప్పటికైనా స్పందించకపోతే మరో పదేళ్లలో చెరువులు కనిపించని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.