High Court Fire on Hydra Demolitions : హైదరాబాద్ ఖాజాగూడ భగీరథమ్మ చెరువు ఎఫ్‌టీఎల్‌లోని కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. నిబంధనలు పాటిస్తూనే ఆక్రమణలు కూల్చివేసినట్లు తెలిపారు. "నీటి వనరుల్లోని నిర్మాణాలను నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేయవచ్చు. ఇటీవల జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఇదే అంశంపై తీర్పును వెలువరించింది. చట్టాల ప్రకారం నడుస్తూ, కోర్టులను గౌరవిస్తూనే ఆక్రమణలు తొలగిస్తున్నాం. మానవతా దృక్పథంతో 24 గంటల సమయంలో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చాం" అని ఏ.వీ రంగనాథ్ వివరించారు.
హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం :హైదరాబాద్ ఖాజాగూడలోని బ్రహ్మనికుంట ప్రాంతంలో ఆక్రమణల తొలగింపులో హైడ్రా వ్యవహరించిన తీరుపై హైకోర్టు మంగళవారం (జనవరి 01న) ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు జారీ చేసి 24 గంటలు గడవకముందే కూల్చివేతలేంటని నిలదీసింది. దీనిపై గతంలో హైడ్రా కమిషనర్‌కు స్పష్టంగా చెప్పినా మళ్లీ అదే తీరు కొనసాగిస్తున్నారని, ఇలాగైతే మరోసారి కోర్టుకు పిలవాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఖాజాగూడలో చెరువు ఎఫ్‌టీఎల్ ప్రాంతమంటూ నిర్మాణాలను కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ మేకల అంజయ్య అనే వ్యక్తి తదితరులు మంగళవారం అత్యవసరంగా విచారించాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామంలోని సర్వే నం.18/ఇలో 12640 చదరపు గజాల స్థలంలో నిర్మాణాలు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయని, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారన్నారని చెప్పారు.