Himayat Sagar and Osman Sagar gates Lifted : ఎగువన కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ శివారులోని జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లు నిండుకుండల్లా మారాయి. పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువ కావడంతో జలమండలి అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. రాగల రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ సూచనతో ముందస్తుగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తారు. హిమాయత్‌సాగర్ ఒక గేటు ఒక అడుగు మేర ఎత్తి 330 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు. ఉస్మాన్ సాగర్‌కు సంబంధించి రెండు గేట్లను అడుగు మేర ఎత్తి 226 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
జంట జలాశయాల నుంచి వదలిన నీరు లంగర్‌హౌజ్ బాపు ఘాట్ మీదుగా మూసీలోకి చేరింది. అక్కడి నుంచి జియాగూడ, పురానాఫూల్, ఛాదర్‌ఘాట్, గోల్నాక, మూసారాంబాగ్, నాగోల్ వరకు మూసీలోకి వరద ప్రవాహం క్రమంగా పెరిగింది. మూసీలో వరద ప్రవాహం పెరగడంతో పరీవాహక ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తం చేశాయి. గేట్లు ఎత్తే ముందే మూడుసార్లు సైరన్ మోగించి పరీవాహక ప్రాంతాల ప్రజలను హెచ్చరించారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచనతో ఆయా శాఖల అధికారులు పరీవాహక ప్రాంతాల పరిస్థితిని సమీక్షించారు. జంట జలాశయాల్లోని నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వరద నీటి ప్రవాహన్ని అంచనా వేస్తున్నారు.
ఉస్మాన్ సాగర్‌లో గరిష్ఠంగా 22 గేట్లు ఎత్తివేత : 2022లో ఉస్మాన్ సాగర్‌లో గరిష్ఠంగా 13 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయగా, మూసీ పరివాహక ప్రాంతంలో వరద నీరు పోటెత్తింది. 2023లో 6 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 2 గేట్లు మాత్రమే ఎత్తగా, ప్రవాహం పెరిగితే క్రమంగా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశాలు కనిస్తున్నాయి.