Hyderabad Student Died In America : అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. కొన్ని రోజుల క్రితం క్లేవ్‌ల్యాండ్‌లో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ (25) మృతి చెందాడు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం ఎక్స్‌లో తెలిపింది. తాము గత కొంత కాలంగా వెతుకుతున్న మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ ఓహైయోలోని క్లేవ్‌ల్యాండ్‌లో మరణించాడని ట్వీట్ చేసింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు స్థానిక పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. మృతదేహాన్ని ఇండియాకు తరలించడానికి సహాయం చేస్తామని ఇండియన్ ఎంబసీ అధికారులు తెలిపారు.
Indian Student Missing In America : హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ మార్చి 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. అతడు క్లేవ్‌ల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఐటీ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. తమకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చిందని అబ్దుల్ తండ్రి మహమ్మద్ సలీం గతంలో చెప్పారు. వారు 1,200 డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని, లేనిపక్షంలో తమ కుమారుడి కిడ్నీ విక్రయిస్తామని బెదిరించినట్లు చెప్పారు. దానికి ఒప్పుకున్న తాము అబ్దుల్ వాళ్ల అధీనంలోనే ఉన్నట్లు ఆధారాలు తెలపాలని అడిగినట్లు మీడియాకు వివరించారు.
హైదరాబాద్ విద్యార్థి రెండు వారాల నుంచి అమెరికాలో మిస్సింగ్ - కుటుంబానికి బెదిరింపు కాల్