Dating Scam in Hyderabad : హైదరాబాదులో డేటింగ్ స్కాంపై మాధాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మీడియా కథనాలు, తమకు వచ్చిన కథనాలు ఆధారాంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో మరో నయా మోసం తెరపైకి వచ్చింది. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్న యువత ఇప్పుడు ఈ డేటింగ్ యాప్‌లకు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇదే ఆసరాగా తీసుకుని కొందరు అందమైన అమ్మాయిలు పబ్ యజమాన్యంతో కలిసి ఒక దందాను నడుపుతున్నారు. ఇప్పుడు ఆ డేటింగ్ స్కామ్ హైదరాబాద్ నగరంలో బయటపడింది.
టింబర్, బంబుల్ వంటి డేటింగ్ సైట్ల ద్వారా అందమైన అమ్మాయిలు యువకులకు వలపు వల విసురుతున్నారు. పరిచయం ఏర్పరుచుకొని వెంటనే నంబర్లు మార్చుకుంటున్నారు. కలుద్దామని వాట్సాప్‌లో సందేశాలు పంపుతున్నారు. అమ్మాయే ఇన్వైట్ చేయడంతో యువకులు వెంటనే కలిసేందుకు రెడీ అవుతున్నారు. ఎక్కడ కలుద్దామని అడిగితే మెట్రో స్టేషన్ వద్దకు రమ్మని చెబుతున్నారు. ఇలా మెట్రో స్టేషన్ వద్దకు వెళ్లిన యువకులకు అక్కడ పక్కనే ఉన్న పబ్‌లోకి అమ్మాయి తీసుకెళ్తోంది. ఇలా లోపలికి వెళ్లిన తర్వాత యువకులకు చుక్కలు కనిపిస్తున్నాయి. తమకు ఖరీదైన మద్యం, ఇతర ఆహార పదార్థాలు కావాలని అడుగుతున్నారు.
ఖరీదైన మద్యం, ఆహారం ఆర్డర్ ఇచ్చి జంప్ : వారి మాటను కాదనలేని యువకులు వాటి తెచ్చి ఇస్తున్నారు. ఇలా గంటలో రూ.40 వేల వరకు బిల్ చేయిస్తున్నారు. వెంటనే వాష్ రూంకో, కాస్త సైడ్‌కు వెళతానని చెప్పి అక్కడి నుంచి జారుకుంటున్నారు. అక్కడ ఎంతసేపు వెయిట్ చేసినా ఫలితం ఉండదు. విషయం అర్థమయ్యేలోపే బిల్ కట్టాలని పబ్ యాజమాన్యం యువకులపై ఒత్తిడి తెస్తోంది.