Hyderabad Metro Rail Second Phase Estimation Cost :తెలంగాణ రాష్ట్ర రాజధానిలో మెట్రో రెండో దశకు త్వరితగతిన అడుగులుపడుతున్నాయి. ఫోర్త్ సిటీ మినహా మిగిలిన 5 కారిడార్లకు డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయి. ఈ నెల 7న దిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ ఖరారు కావడంతో ఆ పర్యటనకు ముందుగానే డీపీఆర్‌లు కావాలని సీఎం కార్యాలయం కోరింది. దీంతో ఏడో తేదీ నాటికి డీపీఆర్‌లను ప్రభుత్వానికి సమర్పించామని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైలు సంస్థ అధికారులు తెలిపారు. నివేదికలు గతంలోనే సిద్ధమైనా కీలకమైన ట్రాఫిక్ అధ్యయన నివేదిక ‘కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్' (సీఎంపీ) కోసం ఆగారు.
సీఎంపీ ముసాయిదా సిద్ధం కావడంతో ఆ నివేదికను డీపీఆర్‌కు జోడించి సర్కారుకు అందజేశారు. దీని ఆధారంగానే సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిని కలిసి ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టేలా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. డీపీఆర్‌లు పంపనున్నట్లు తెలిపారు. దీనిపై కేంద్రం సైతం సానుకూలంగా ఉన్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. 18 శాతం కేంద్రం నిధులతో మెట్రోరైలు ప్రాజెక్టులను వేర్వేరు నగరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యాలతో నిర్మిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం భరించే వాటా సాధారణంగా 15 శాతం ఉంటుంది. హైదరాబాద్ మెట్రో రెండోదశలో 18 శాతం వరకు ప్రతిపాదిస్తున్నారు.