Hyderabad Lac Bangles GI Tag :హైదరాబాద్‌లోని పాతబస్తీ లక్కగాజులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్(జీఐ) లభించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్‌మార్క్స్ గుర్తింపును మంజూరు చేసింది. ఇదివరకే హైదరాబాద్ హలీమ్‌కు(Hyderabad Halim) జీఐ ట్యాగ్ దక్కగా, తాజాగా లక్క గాజులు ఆ జాబితాలో చేరాయి.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్మినార్ లాడ్‌బజార్ లాక్ బేంగిల్స్‌ను (Laad Bazaar Lac Bangles) తెలుగులో లక్క రాళ్ల గాజులుగా పిలుస్తుంటారు. తాజాగా ఈ లక్క గాజులకు చెన్నైలోని సెంట్రల్ గవర్నమెంట్ జీఐ రిజిస్ట్రీ శనివారం జీఐ రిజిస్ట్రేషన్ ట్యాగ్‌ను ప్రకటించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో జీఐ ట్యాగ్ అందుకున్న 17వ ఉత్పత్తిగా ఇది చోటు దక్కించుకుంది.
Hyderabad Lac Bangles Geographical Indication : హైదరాబాద్ నగరంలో పాతబస్తీ గాజులకు ప్రసిద్ధి. ఇక్కడ వివిధ రకాల గాజులు తయారవుతుంటాయి. అందులో లక్క రాళ్ల గాజులు స్థానిక, అంతర్జాతీయ మార్కెట్లో(International Market) బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ గాజుల తయారీ ప్రక్రియ ఎంతో క్లిష్టమైనది. రెసిన్ పదార్ధాన్ని కొలిమిపై కరిగిస్తే లక్క వస్తుంది. దీన్ని వృత్తాకారంలో మలిచి, దానిపై రాళ్లు, పూసలు, స్ఫటికాలు, అద్దాలను హస్తకళాకారులు అందంగా చేతులతోనే పొదుగుతారు.