Hyderabad Greater City Corporation :గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్‌గా ఆవిష్కరించేందుకు తెలంగాణ సర్కార్ వ్యూహ రచన చేస్తోంది. రాష్ట్ర రాజధాని శివారున ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఒకే వ్యవస్థగా విలీనం చేసేందేకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలను హైదరాబాద్ కార్పొరేషన్‌లో విలీనంపై కసరత్తు చేయాలని అధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు.
Telangana Govt Plans to Merger Corporations and Municipalities : విలీనం చేస్తే ఏకరూపంలో అభివృద్ధి చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్లు ఉంటే జనాభా కోటికిపైగా ఉంది. ఏడు కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీల్లో సుమారు 60 లక్షల వరకు జనాభా ఉంటుందని అంచనా. ఒకవేళ విలీనం చేస్తే 1.80 కోట్ల నుంచి 2 కోట్లకు జనాభా చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విలీన ప్రాంతాలన్నింటిని గ్రేటర్ సిటీ కార్పొరేషన్‌గా ఒకటిగా ఏర్పాటు చేయాలా? లేదా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణం వేర్వేరుగా నాలుగు సిటీ కార్పొరేషన్లుగా విభజించాలా? అన్న అంశాన్ని అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు ఆదేశాలిచ్చారు.
తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ - 2050 విజన్ దిశగా ముందుకు : సీఎం రేవంత్‌రెడ్డి
ఏడాది తర్వాతే ప్రత్యేకాధికారులు! : ప్రాంతీయ రింగు రోడ్డు వరకు హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విలీనం ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే గ్రేటర్ హైదరాబాద్ (GHMC) శివారు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ముగిశాకే పత్యేక అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
ఏకరూప అభివృద్ధి : ప్రస్తుతం కొన్ని డివిజన్లలో లక్ష మందికిపైగా జనాభా ఉంటే, మరికొన్ని కార్పొరేషన్లలోని డివిజన్లలో 30,000ల మంది మాత్రమే ఉన్నారు. నిధుల కేటాయింపులో సమతౌల్యం లోపించిందన్న అభిప్రాయం ఉంది. మౌలిక వసతుల కల్పనకు నిధులు, గ్రాంట్లను ఒకే రీతిలో కేటాయిస్తే ఆయా ప్రాంతాల అభివృద్ధి ఏకరూపంలో సాగడానికి అవకాశం ఉంటుందని అధికారుల అంచనా. నగర విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు తదితరాల కోసం భారీగా నిధులు వెచ్చించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.