Hyderabad Girl Met With Accident Scored Well in 10th :రెప్ప పాటులో జరిగిన ప్రమాదం మానసికంగా కుంగదీసినా, తీవ్రగాయాలు శరీరాన్ని వేధిస్తున్నా, లక్ష్యం మరువలేదు ఈ అమ్మాయి. భరించలేనంత నొప్పితో బాధపడుతూనే ఆత్మ స్థైర్యం కూడగట్టుకుని పది పరీక్షలు రాసింది. వయసుకు మించిన పరిణతిని ప్రదర్శించి లక్ష్యం కోసం పోరాడి అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది.
హైదరాబాద్‌లోని నాంపల్లికి చెందిన ఈ అమ్మాయి పేరు కిర్పాన్ కౌర్. తరణ్ జిత్ సింగ్, అస్మిత్ కౌర్ దంపతుల మొదటి కుమార్తె. ఖనూజా అబిడ్స్ స్లేట్ స్కూల్‌లో 10వ తరగతి పూర్తి చేసింది. ఈ ఏడాది మార్చి ఒకటిన ప్రీ ఫైనల్ పరీక్ష రాసి తల్లి అస్మిత్ కౌర్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికెళ్తుండగా ఓ యువకుడు వేగంగా వచ్చి బైక్‌ను వెనక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం బారిన పడింది. తల్లి అస్మిత్ కౌర్‌కు స్వల్ప గాయాలైనా, కిర్పాన్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
On A Ventilator Two Weeks Before Exams : హఠాత్తుగా జరిగిన ప్రమాదంతో వారం రోజులు హాస్పిటల్‌లోనే ఉండిపోయింది కిర్పాన్ కౌర్. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక మెల్లగా జరిగింది అర్థం చేసుకోవటం మొదలుపెట్టింది. పది పరీక్షలకు సరిగ్గా 2 రోజులే ఉందని తెలిసి నిరాశ కలిగినా, తన కష్టం ఎట్టి పరిస్థితిల్లోనూ వృథా కాకూడదని నిశ్చయించుకుంది. పట్టుబట్టి తల్లిదండ్రుల్ని ఒప్పించి పరీక్షలకు హాజరయ్యింది.
"నేను ఇంటికి వచ్చాక కూడా స్పృహలో లేను. లేచి చూసేసరికి నాకు ఏమైందో కూడా సరిగ్గా తెలీదు. నా మొఖం మీద అన్ని మరకలు ఉన్నాయి. ఒకసారి అయితే పరీక్షలు రాయలేను అనుకున్నాను. కానీ ఎలాగైనా రాయలి అనుకున్నాను. ఈ విషయం ఇంట్లో చెప్తే మొదట్లో కంగారుపడ్డారు. కానీ తర్వాత వారు మా టీచర్స్ సంప్రదించడంతో వారి సహాయంతో పరీక్షలు రాయగలిగాను. ఇంత మంచి మార్కులు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను."- కిర్పాన్ కౌర్, విద్యార్థి