తెలంగాణ

telangana

ETV Bharat / state

అందరితో స్నేహం వృత్తిలోనే సంతోషం - ఈ కండక్టర్​ వెరీ ఫ్రెండ్లీ బ్రో - HYDERABAD LADY CONDUCTOR STORY

Hyderabad Bus Conductor Inspirational Story : పాతికేళ్ల కిందట మహిళలు వంటిల్లు దాటి ఉద్యోగం చేయడమంటే అంత సులభంగా ఒప్పుకునేవారు కాదు. అందులోనూ ఆర్టీసీ బస్సులో కండక్టర్​గా అది కూడా నిత్యం రద్దీగా ఉండే సిటీ బస్సుల్లో ఉద్యోగం అంత ఆషామాషీ కాదు. కానీ హైదరాబాద్​కు చెందిన అనూప రాణి మాత్రం 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ అదే ఉత్సాహం, అదే ఉల్లాసంతో ఆర్టీసీని తన సొంత సంస్థలా భావిస్తూ ప్రయాణికులే కుటుంబంగా సేవలందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆమె బస్ వచ్చిందంటే ప్రయాణికులంతా ఆటోలు మానేసి అందులోనే వెళ్తారు. ఎందుకంటే ఆమె వాళ్లని తన కుటుంబ సభ్యుల్లాగా పలకరిస్తారు మరి. తాజాగా ఆర్టీసీ ఎండీ ప్రశంసలు సైతం అందుకున్న అనూపరాణి కథేంటో చూద్దామా!

Hyderabad Bus Conductor Inspirational Story
Friendly Lady Conductor Special Story (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 9, 2024, 2:54 PM IST

Friendly Lady Conductor Special Story : చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం వచ్చేవరకు చాలా కష్టపడతారు. ఓసారి పనిలో చేరిపోయాక నెలనెలా జీతం వస్తుంటే, మొక్కుబడిగా పని చేసుకుంటూ పోతారు. కానీ కొందరు మాత్రం వృత్తి పట్ల నిబద్ధతతో తన శక్తియుక్తుల్ని పనికోసం కేటాయిస్తూ అంకితభావంతో పనిచేస్తారు. అలాంటి కోవకే చెందుతారు రాజేంద్రనగర్ ఆర్టీసీ డిపోలో కండక్టర్​గా పనిచేస్తున్న అనూప రాణి.

రంగారెడ్డి జిల్లా సురంగల్ గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆమె, ఉప్పర్​పల్లిలో ఉంటూ పదో తరగతి పాసయ్యాక 2000 సంవత్సరంలో ఆర్టీసీలో కండక్టర్​గా చేరారు. ఇంట్లో ఎన్ని చిరాకులున్నా పనిలో చూపించకు బిడ్డా అన్న నాన్న మాటల్ని నేటికీ పాటిస్తారామె. ఉద్యోగం తర్వాత కూడా చదువు ఆపలేదు. 2005లో పెళ్లయ్యాక ఉస్మానియా వర్సిటీలో ఎంఏ సోషియాలజీ, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేశారు.

రండి బాబు, రండి సురక్షిత ప్రయాణానికి మా బస్సెక్కండి : ఉన్న ఉద్యోగంతో ఆగిపోక, గ్రూప్ -2 కోసం కూడా అలుపెరుగక శ్రమించారు. ఉదయం 4 గంటలకు లేచి 5 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఆర్టీసీ క్రాస్ రోడ్​లో శిక్షణ తర్వాత అటు నుంచి అటే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. అయితే పరీక్ష పాసయ్యారు కానీ ఇంటర్యూలో నెగ్గుకు రాలేకపోయారు. ఇప్పటికీ వాళ్ల కుమారుడు బీటెక్ చేస్తున్నా సరే ఏదో ఒక కాంపిటీటివ్ రాస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఉద్యోగం కోసం కాదు గానీ యువతకు ఏదైనా చెప్పాలనే ఉద్దేశంతో రోజూ తెలుగు, ఇంగ్లీష్ పత్రికలు చదువుతానంటున్నారు. ఆమె బస్టాండ్​లోకి వచ్చిందంటే అక్కడంతా సందడే. మెహిదీపట్నం నుంచి ఎల్బీనగర్ మీదుగా రోజూ ప్రయాణించే వారిలో చాలా మందికి అనూప సుపరిచితం. అంతగా వారితో సన్నిహితంగా ఉంటారు మరి. రండి బాబు, రండి సురక్షిత ప్రయాణానికి మా బస్సెక్కండి. వేగంగా తీసుకెళ్తాం అంటూ అందర్నీ ఉత్సాహపరుస్తారు. తమ్ముడూ, చెల్లి, నాన్నా, కన్నా అంటూ అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తారు.

ఎవరైనా మూడీగా ఉంటే ఏమైంది అంటూ మంచి చెడులు కనుక్కుంటారు. యువత ఫోన్ వాడుతూ అల్లరి చేస్తుంటే చనువుగా మందలిస్తూ మంచి మాటలు చెబుతారు. అందుకే ఆమె అందరి మనిషి అయ్యారు. అక్కా, వదినా, ఆంటీ అంటూ ప్రయాణికులు కూడా ఆమె సొంత మనిషిలాగే పలకరిస్తారు. రోజంతా పనిచేసినా ఉత్సాహం, ఉల్లాసం ఆమె మోములో ఎప్పుడూ చెరగకుండా ఉంటుంది. ఇరవై ఏళ్లుగా ఒకే రూటు, ఆ ప్రాంతాలన్నీ తెలుసు కాబట్టి ఎవరు ఎక్కడికి పోవాలన్నా వివరంగా చెబుతారు.

ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు :అందరితో స్నేహంగా మెదులుతూ వృత్తిలోనే సంతోషం వెదుక్కుంటారు అనూప రాణి. ఇదే కాదు తాను సంపాదించిన దాంట్లో కొంత పేదలకు కూడా దానం చేస్తానని, పేదవారి పెళ్లిళ్లకు తాళి, మెట్టెలు కూడా ఇస్తానని తెలిపారు. ఎంతో మంది ఉద్యోగులున్నా కొందరు మాత్రం తన పనితీరుతో సంస్థకే పేరు తెస్తారని రాజేంద్రనగర్ డిపో మేనేజర్ అన్నారు. అనూప లాంటి వారి వల్ల హైదరాబాద్​లో తమది ఉత్తమ డిపోగా పేరు పొందిందని, ఆమెకు కూడా ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు రావడం గర్వకారణమని ఆయన అన్నారు.

ఆమె గురించి తెలిసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం ప్రెండ్లీ ఉద్యోగులే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లని కితాబిచ్చారు. నిబద్ధత, అంకితభావం గల ఇలాంటి ఉద్యోగుల వల్లే రోజూ లక్షలాది మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు అని ట్వీట్ చేశారు. నలుగురిలో తిరిగే ఏ ఉద్యోగమైనా కాస్త ఇబ్బందిగానే ఉన్నా ఇష్టంతో చేస్తే కష్టం ఉండదు అంటారు అనూప రాణి.

ABOUT THE AUTHOR

...view details