తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​ను రక్షించుకునేందుకు 'మహా ప్రణాళిక' - ఆ కష్టాలకు ఇక పర్మినెంట్​గా చెక్! - HYDERABAD GRAND PLAN IN 3 MONTHS

హైదరాబాద్ అభివృద్ధికి మాస్టర్​ ప్లాన్ - మూడు నెలల్లో రాజధాని మహా ప్రణాళిక! - వరద నీరు మళ్లింపే లక్ష్యం

Hyderabad City Master Plan
Hyderabad City Master Plan (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2024, 10:52 AM IST

Hyderabad City Master Plan : అరగంట వర్షం పడితే చాలు హైదరాబాద్​ మహా నగరం చెరువును తలపిస్తోంది. ఈ సమస్య ఒక్కసారి అయితే ఏదో అనుకోవచ్చు. కానీ ఎప్పుడు వర్షం పడినా ఇదే తీరు. వర్షపు నీటి సమస్య ప్రతి ఏడాది ఉత్పన్నమవుతూనే ఉంది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయి, ట్రాఫిక్​ కష్టాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద ముప్పును ఎదుర్కొని బిక్కుబిక్కుమని గడుపుతూ ఉంటున్నారు. అయితే ఈ సమస్యకు పూర్తి పరిష్కారాన్ని కనుగొనేందుకు నగరపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తోంది. వరద ముప్పు నుంచి హైదరాబాద్​ను రక్షించేందుకు 'మహా ప్రణాళిక' సిద్ధం చేస్తోంది.

ఈ ప్రణాళికలు 2050 నాటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని వివిధ అంశాలపై రూపొందిస్తున్నారు. అందులో కీలకమైనది వరద మళ్లింపు. ఈ ప్రణాళిక వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికల్లా సిద్ధం కానుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అసమతౌల్యం కారణంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎన్నడూ లేని విధంగా ఉన్నట్లుండి ఒకేసారి కుండపోత వర్షం వచ్చి మీదపడుతోంది. ముఖ్యంగా ఈ తరహా వర్షాలతో నగరాల్లో జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. ఆస్తి నష్టం కూడా అపరిమితంగానే ఉంటోంది. ఇందుకు నిదర్శనం ఈ ఏడాదే సంభవించిన విజయవాడ వరద బీభత్సం.

2020లో కూడా హైదరాబాద్​ను ఇలాంటి వరదే వణికించింది. ఇలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో మరింతగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తూ, ఇందుకు తగిన ప్రణాళికలను నగరపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ సిద్ధం చేస్తోంది. 2050 నాటికి అవుటర్​ రింగ్​ రోడ్డు పరిధిలో అభివృద్ధి చెందే నగరం అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రణాళికలు రూపొందించింది. అందులో ప్రధానం వరద మళ్లింపు.

నాలాలు 8 సెం.మీ. వర్షాన్ని తట్టుకోగలవు : హైదరాబాద్​లో ఇప్పుడున్న నాలా వ్యవస్థ రోజుకి 8 సెంటీమీటర్ల వర్షాన్ని మాత్రమే తట్టుకోగలదు. కానీ 2020 అక్టోబరు నెలలో మాత్రం ఒక్కరోజే 19.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్​ లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం కాగా, రోజుల తరబడి జనాలు బురదలో బిక్కుబిక్కుమంటూ బతికారు.

వరద నీరు నాలాల ద్వారా చెరువులోకి.. అక్కడి నుంచి మూసీలోకి : హైదరాబాద్​ నగరంలో మూసీకి ఇరువైపులా 15 వరకూ చెరువులు ఉన్నాయి. నగరంలో కురిసే వరద నీరును ముందుగా ఈ చెరువుల్లోకి, అక్కడి నుంచి మూసీలోకి మళ్లించడం ద్వారా వరద ముప్పును ఎదుర్కోవచ్చనే ఆలోచన చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్​లో ఎటుచూసినా చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఉన్నవాటిల్లో పూడిక పేరుకుపోయింది. వరద నీరు చెరువుల్లోకి కలిసే నాలాలు పూడిపోయాయి. అందుకే చెరువుల ప్రస్తుత సామర్థ్యం, వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపైనా అధ్యయనం చేస్తున్నారు. అందులో భాగంగా చెరువులకు చేరిన నీరు మూసీలో కలిసేలా ప్రణాళికను చేస్తున్నారు. మూసీ సుందరీకరణ పథకానికి ఇది చాలా ఊతమిస్తుందని అధికారులు తెలుపుతున్నారు.

హైదరాబాద్​లో పలుచోట్ల దంచికొట్టిన వర్షం - జలమయమైన రహదారులు

హైదరాబాద్‌ చెరువులకు మహర్దశ! - మంచినీటి జల వనరులుగా తీర్చిదిద్దనున్న హైడ్రా

ABOUT THE AUTHOR

...view details