Bank Manager Involved In Cyber Crime :సైబర్ నేరాల్లో పోలీసులు ఎంతమంది నిందితులను అరెస్ట్ చేస్తున్నా డబ్బుల రికవరీ రేటు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటోంది. ఇందుకు ప్రధాన కారణం బాధితులు పోగొట్టుకున్న సొమ్ము గంటల వ్యవధిలోనే ఇతర ఖాతాల్లోకి మళ్లుతోంది. ఆ తర్వాత క్రిప్టో కరెన్సీగా మారిపోతోంది. డబ్బుల రికవరీలో పోలీసులు ఏం చేయలేక పోతున్నారు.
తాజాగా హైదరాబాద్ పాతబస్తీలోని షంషేర్‌గంజ్ ఎస్బీఐకి చెందిన 6 ఖాతాల నుంచి రూ.175 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ డబ్బంతా క్రిప్టో రూపంలో చైనాకు తరలిపోయినట్లు దర్యాప్తులో తేల్చారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. దుబాయిలో ఉన్న ప్రధాన నిందితుడు చైనా సహా ఇతర దేశాల నేరగాళ్లతో చేతులు కలిపి డబ్బును క్రిప్టోగా మార్చి తరలిస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
బ్యాంకు మేనేజర్ లీలలు వెలుగులోకి :మార్చి-ఏప్రిల్ నెలలో షంషేర్ గంజ్‌లో ఎస్బీఐ ఆరు ఖాతాల నుంచి జరిగిన లావాదేవీలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిఘా పెట్టింది. అనుమానాస్పదంగా కోట్లలో లావాదేవీలు జరగడంతో తొలి ఖాతాదారుడు మహ్మద్ బిన్ బవజీర్, మరో వ్యక్తి షోయబ్‌లను అరెస్ట్ చేశారు. దర్యాప్తు క్రమంలో గతంలో అక్కడ పనిచేసిన ఎస్బీఐ మేనేజర్ గాలి మధుబాబు పాత్ర బయటపడింది.
దుబాయ్‌లో ఉన్న ప్రధాన నిందితుడి కోసం సందీప్ ఉపాధ్యాయ అనే జిమ్ ట్రైనర్ స్థానికంగా ఉన్న కొందరికి డబ్బు ఆశ చూపి ఖాతాలు తెరిపించాడు. ఇందుకు మేనేజర్ మధుబాబు సహకారం తీసుకున్నాడు. ఎటువంటి వ్యాపారం లేకపోయినా ఆటో, క్యాబ్ డ్రైవర్లుగా పని చేస్తున్న ఆరుగురికి కరెంట్ ఖాతాలు తెరిపించాడు. ఇందుకు సంబంధించిన పేపర్ వర్క్ అంతా సందీప్ చూసుకున్నాడు. ఖాతాలు తెరిచేందుకు సహకరించిన బ్యాంక్ మేనేజర్ మధుబాబుకు లక్షల్లో డబ్బు ముట్ట జెప్పాడు. ఖాతాదారులకు ఒక్కొక్కరికి 20నుంచి 30వేలు చెల్లించాడు.