Digital Arrest In Hyderabad : సైబర్ క్రైమ్ బారిన పడ్డవారి గురించి తెలిసిన వారు ఎవరైనా ముక్కూ ముఖం తెలియన వాడు ఫోన్ చేస్తే భయపడి ఉన్నదంతా ఊడ్చి ఇచ్చేస్తారా? అనే సందేహం వస్తుంది. కొందరైతే అలా జరిగి ఉండదులే అని కొట్టిపారేస్తారు.సైబర్ నేరగాళ్లు బాధితుడికి కాల్ చేసి, వారు చెప్పింది వినేది తప్ప మరో పరిస్థితి కల్పించకుండా చేస్తారు. బెదిరిస్తారు, కేసులున్నాయంటారు. మాట వినకుంటే జైలుకు వెళ్తారని ఇలా నానారకాలుగా ఇబ్బందులకు గురిచేస్తారు.
డిజిటల్ అరెస్టులంటూ బెదిరింపులు : తాజాగా ‘డిజిటల్ అరెస్ట్’ అంటూ సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ లక్ష్యంగా చేసుకొని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. నగర సైబర్‌క్రైమ్‌లో నమోదవుతున్న కేసుల్లో అధికభాగం ఇవే ఉంటున్నాయి. సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ, సైబర్‌క్రైమ్ పోలీసులమంటూ యూనిఫాం ధరించి తేలికగా బోల్తా కొట్టిస్తారు. తమ ఆదేశాలు పట్టించుకోకపోతే కుటుంబమంతా చిక్కుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని బెదిరిస్తారు. డ్రగ్స్, మనీలాండరింగ్ అంశాలను బూచిగా చూపి అక్రమ నగదు లావాదేవీలు జరిగాయంటారు. తాము సూచించిన ఖాతాలకు నగదు జమచేస్తే ఆ లావాదేవీలను పరిశీలించి తిరిగి డబ్బంతా ఇస్తామంటూ స్వాహా చేస్తున్నారు.
వారు చేయని నేరాలకు జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందనే భయంతో బాధితులు మౌనంగా వహిస్తున్నారు. గంటలు, రోజుల తరబడి ఇంటిగడప దాటకుండా భయాందోళన మధ్య గడుపుతున్నారు. ఇంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేటుగాళ్లు ప్రస్తుతం రూటు మార్చారు. బాధితుల నగదు చెల్లించటంలో ఆలస్యం చేసినా, ప్రశ్నలు వేసినా కొత్త అస్త్రం ఉపయోగిస్తున్నారు. తమ శాఖ అధికారులు గుమ్మం వద్ద సిద్ధంగా ఉన్నారని, మీ కదలికలను వీడియో రికార్డు చేస్తున్నారంటూ బెదిరిస్తున్నారు. ఇప్పటికే రెక్కీ నిర్వహించామని, దర్యాప్తునకు ఏమాత్రం సహకరించకపోయినా కారులో ఎత్తుకెళ్తామంటూ బెంబేలెత్తిస్తున్నారు.