Huge Water Inflow To Jurala Project : జోగులాంబ గద్వాల జిల్లా లోని జూరాల జలాశయంకు ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో జలకళను సంతరించుకుంది. ఆల్మట్టి జలాశయం 81 వేల 33 వేల క్యూసెక్కులు నీరు ప్రాజెక్టులోకి చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి దిగువకు 65 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 519.60 మీటర్లు కాగా ప్రస్తుతం 518.11 మీటర్లుగా ఉంది.
ఆల్మట్టి పూర్తిస్థాయి నీటి నిలువ 123.08 టీఎంసీలు కాగా ప్రస్తుతం 99.317 టీఎంసీలుగా ఉంది. నారాయణపూర్ జలాశయంలోకి 55వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతుండగా ప్రాజెక్టు నుంచి దిగువకు 12 గేట్లు తెరిచి 37,260 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 492.25 మీటర్లు కాగా ప్రస్తుతం 491.68 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ 33. 31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30.69 టీఎంసీలుగా ఉంది. ఈ ప్రవాహం రేపు ఉదయంలోగా జూరాలకు చేరనుంది.
జూరాలకు భారీగా వరద నీరు :ప్రస్తుతం జూరాల జలాశయానికి 2,500 క్యూసెక్కులు ప్రాజెక్టులకు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు నుంచి 2,700 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు యొక్క పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.510 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.663 టీఎంసీలుగా ఉంది. జూరాల జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో జూరాల అధికారులు జల విద్యుత్ ద్వారా ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్ట్ కుడి, ఎడమల కాలువలతో పాటు నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకానికి సాగు నీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు.