Huge Response to Prajadarbar Conducted by Nara Lokesh:మంగళగిరి నియోజకవర్గ ప్రజలకోసం మంత్రి నారా లోకేశ్ ప్రారంభించిన ప్రజాదర్బార్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. తెల్లవారుజామునుంచే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్దఎత్తున జనం బారులు తీరుతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేశ్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు.
రోజరోజుకు ప్రజలనుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతమంది వచ్చినా ఓపిగ్గా వారినుంచి వినతులు స్వీకరిస్తూ యువనేత లోకేశ్ భరోసా ఇస్తున్నారు. తమదృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు ఇస్తున్నారు.
ఈ రోజు నిర్వహించిన ప్రజాదర్బార్‌లో పెద్దఎత్తున వినతులు వెల్లువెత్తాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా భూకబ్జాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను తమ పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంతో పలువురు బాధితులు నారా లోకేశ్‌ను కలిసి తమ కష్టాలను ఏకరువు పెట్టుకున్నారు.